AP

రోజాకు ఎసరు పెడుతున్న పెద్దిరెడ్డి..

ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. అయితే మంత్రి రోజా రచ్చ గెలిచినా ఇంట గెలవలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ హుళక్కేనన్న ప్రచారం జరుగుతోంది.

ఆమెకు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెక్ చెబుతున్నట్లు తెలుస్తోంది. జగన్ కరుణతో అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న రోజాకు అనుకున్నంత ఈజీగా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. నగిరి అసెంబ్లీ సీట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేరే వారికి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

గత రెండు ఎన్నికల్లో రోజా అతి కష్టం మీద నగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే ఆమె గెలిచిన నాటి నుంచి వైసీపీ శ్రేణులను కలుపు కెళ్ళడం లేదన్న అపవాదు ఉంది. ప్రస్తుతం నగిరి నియోజకవర్గ వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. అందులో ఒక వర్గానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్ ఉంది. ఆ వర్గం నాయకులంతా రోజాతో పని లేకుండా పెద్దిరెడ్డి ప్రోత్సాహంతో నామినేటెడ్ పదవులు దక్కించుకున్నారు. నియోజకవర్గంలో వారికి సంబంధించిన పనులు ఏవీ ఆగడం లేదు.ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా అదే మాదిరిగా తగ్గించుకుంటారు అన్న ప్రచారం జరుగుతోంది.. అటు నియోజకవర్గంలో మూడోసారి రోజా పోటీ చేస్తే ఓటమి తప్పదు అన్న నివేదికలు హై కమాండ్ కు అందినట్లు తెలుస్తోంది. అందుకే అక్కడ ఓ బీసీ నేతను పెద్దిరెడ్డి ప్రపోజ్ చేసినట్లు సమాచారం.

గత కొద్దిరోజులుగా పెద్దిరెడ్డి, రోజాల మధ్య పొసగడం లేదన్నట్లు తెలుస్తోంది. కోల్డ్ వార్ నడుస్తోంది.దీంతో వచ్చి ఎన్నికల్లో నగిరి టిక్కెట్ ని రోజాకు ఇవ్వరాదని పెద్దిరెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి మాట జగన్ వద్ద చెల్లుబాటు అవుతోంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల బాధ్యతను పెద్దిరెడ్డికే జగన్ అప్పగించారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ఆమోదం లేకుండా రోజాకు నగిరి టిక్కెట్ ఇచ్చే ఛాన్సే లేదని తెలుస్తోంది.

ఈనెల 28న నగిరి నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటంచనున్నారు. దీనిని మంత్రి రోజా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఏకంగా బలప్రదర్శనకే దిగుతున్నారు. ఇదే సభలో నగిరి నియోజకవర్గ అభ్యర్థిగా తన పేరు ప్రకటించేలా సీఎం జగన్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పాటికే మంత్రి రోజాపై ఓ నివేదిక జగన్ వద్దకు చేరింది. దీంతో జగన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రోజాను ప్రకటిస్తారో లేదో చూడాలి మరి.