రానున్న సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వీడుతున్నట్లు స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ ప్రకటించారు.
అతను పార్టీకి గుడ్ బై చెప్పటానికి గల కారణాలను తెలియజేశారు. అతని రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాను పార్టీలో చేరానని.. తనకు అలాంటి సహకారం అందలేదని ఆరోపించారు. జాతీయవాద నేత అయిన నేతాజీ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో బీజేపీ తనకు సహకరించలేదని రాజీనామా లేఖలో చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆజాద్ హింద్ మోర్చా స్ధాపించి కుల మతాలకు అతీతంగా నేతాజీ ఆలోచనల మేరకు అన్ని వర్గాలను భారతీయులుగా ఏకం చేయాలని అనుకున్నామని లేఖలో తెలిపారు.
చంద్రకుమార్ బోస్ 2016 అసెంబ్లీ, 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్టుపై పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత పార్టీ అధిష్టానం ఆయనను బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమించింది. కానీ 2020లో పార్టీ నాయకత్వ మార్పుల్లో భాగంగా చంద్రకుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు టిక్కెట్ నిరాకరించారు.