Technology

సూర్యుడిపై భారత్ చేపడుతున్న ప్రయోగాల్లో తొలి అడుగు

సూర్యుడిపై భారత్ చేపడుతున్న ప్రయోగాల్లో తొలి అడుగు పడింది. భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఇవాళ ఉదయం సౌర మిషన్ ఆదిత్య ఎల్ 1ను విజయవంతంగా శ్రీహరికోట నుంచి ప్రయోగించింది.

దీంతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ లో సంబరాలు మిన్నంటాయి. రాకెట్ ప్రయోగం తర్వాత దాదాపు గంటసేపు ఉత్కంఠగా ఎదురుచూసిన శాస్త్రవేత్తలు … రాకెట్ నుంచి ఆదిత్య ఎల్ 1 విడిపోగానే సంబరాలు చేసుకున్నారు.

తాజాగా చంద్రయాన్ 3 విజయంతో ఉత్సాహంగా ఉన్న సైంటిస్టులు.. ఇప్పుడు ఆదిత్య ఎల్ 1 కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన నిర్దేశిత మార్గంలో సాగిపోతుండటంతో సంతోషంలో మునిగితేలిపోయారు. ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు. ఇందుకు కారణమైన ప్రతీ శాస్త్రవేత్తనూ ఆయన అభినందించారు. వరుసగా రెండో ప్రయోగం విజయవంతం కావడంపై ఆదిత్య ఎల్ 1 ప్రయోగం కోసం పనిచేసిన శాస్త్రవేత్తలు కూడా సంతోషం వ్యక్తం చేసారు.

మరోవైపు ఇస్రో శాస్త్రవేత్తలు ఊహించినట్లుగానే విజయవంతంగా ప్రయాణం సాగిస్తున్న ఆదిత్య ఎల్ 135 రోజుల ప్రయాణం తర్వాత లాగ్రాండ్ పాయింట్ కు చేరుకోనుంది. అక్కడి నుంచి ఐదేళ్ల పాటు సూర్యుడి గురించి కీలక సమాచారాన్ని భూమికి పంపనుంది. ఇవాళ ఉదయం పీఎల్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 అంతరిక్ష నౌక దాదాపు గంటసేపు ప్రయాణం తర్వాత రాకెట్ నుంచి విడిపోయింది. ఇక అక్కడి నుంచి తన సొంత బూస్టర్ల ద్వారా ఎల్ 1 పాయింట్ వరకూ తన ప్రయాణం సాగించబోతోంది.

సూర్యుడికీ, భూమికీ మధ్య ఉండే వాతావరణం, సౌర తుఫాన్లు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఇలా చాలా అంశాల్ని ఆదిత్య ఎల్ 1 మిషన్ అధ్యయనం చేయబోతోంది. దాదాపు నాలుగు నెలల తర్వాత 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఎల్ 1 పాయింట్ కు చేరుకోబోతున్న ఆదిత్య ఎల్ 1 నౌక.. అక్కడి నుంచి ఐదేళ్ల పాటు కీలక సమాచారం భూమికి పంపుతుంది. దీంతో యూఎస్, ఐరోపా స్పేస్ ఏజెన్సీల తర్వాత సూర్యుడిపై ప్రయోగాలు సాగిస్తున్న సౌర మిషన్ల సరసన ఆదిత్య ఎల్ 1 కూడా చేరబోతోంది.