వినాయక చవితిని ఎప్పుడు నిర్వహించుకోవాలనే గందరగోళం నడుస్తోంది. 18, 19 రెండు తేదీల్లో చవితి ఉండటంతో అందరూ సందిగ్ధంలో పడిపోయారు. ఆగమ పండితులు చెబుతున్నదాని ప్రకారం ఈనెల 18వ తేదీ సోమవారం పండగ జరుపుకోవాలని సూచిస్తున్నారు.
సోమవారం ఉదయం 10.15 గంటల వరకు తదియ ఉంది. మధ్యాహ్నం నుంచి చతుర్ధి మొదలై మంగళవారం ఉదయం 10.43గంటల వరకు ఉంది.
ఇటువంటి సందర్భాల్లో చతుర్ధి మొదలైన రోజునే వినాయకచతుర్ధి జరుపుకోవాలని గ్రంథాలు చెబుతున్నాయి. 2000, 2009, 2010, 2019 సంవత్సరాల్లో కూడా ఇటువంటి సందిగ్ధతే ఏర్పడింది. అప్పుడు కూడా తదియతో ఉన్న చతుర్ధినే పర్వదినంగా జరుపుకున్నారనే విషయాన్ని పండితులు తెలియజేస్తున్నారు. వినాయక చవితి ఎప్పడునే గందరగోళంపై వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న స్వయంభూ కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం కూడా స్పష్టత ఇచ్చింది.
చవితి తిథి ఈ నెల 18నే అని చెబుతోంది. కాణిపాకం దేవస్థానం వినాయక చవితిని ఆరోజే జరుపుతోంది. ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి 18-9-2023 సోమవారం ఉదయం 10-15 నిమిషాలు నుంచి తర్వాత రోజు ఉదయం 10-43 నిమిషాల వరుకు ఉంటుంది. 18-9-2023 రోజు రాత్రి మాత్రమే చవితి తిథి ఉంది. ఆ తిథి ప్రాకారం కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 21 రోజుల పాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన వేద పండితులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. 18నే పండగ జరుపుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ మండప నిర్మాణాలు జరుగుతున్నాయి.