AP

ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించిన నోటీసులు రాజకీయంగా దుమారం

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించిన నోటీసులు రాజకీయంగా దుమారం రేపుతోంది.

దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శల జడివానను ఎదుర్కొంటోన్నారాయన. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు చంద్రబాబుపై ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు.

తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులను అప్పగించిన ప్రతి కాంట్రాక్ట్ సంస్థ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు చంద్రబాబు. 118,98,13,207 కోట్ల రూపాయల లంచాన్ని తీసుకున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ కేసులో ఐటీ శాక అధికారులు దర్యాప్తు సాగిస్తోన్న కొద్దీ.. కొత్త విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి.

దీనిపై చంద్రబాబు తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేయొచ్చని అంచనా వేశారు. తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు వైసీపీ ప్రభుత్వం దిగుతోందని మండిపడ్డారు. తాను నిప్పునని, ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఏ కేసులో ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు.

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తాజాగా వైఎస్ఆర్సీపీ లోక్‌సభ సభ్యుడు నందిగం సురేష్ స్పందించారు. చంద్రబాబుకు భవిష్యత్ కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఆయన బాగోతం తవ్వుతున కొద్దీ బయట పడుతోందని, ఐటీ నోటీసులకు సమాధానం చెప్పకుండా దొంగలా తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు.

తెలుగువారి ఆత్మ గౌరవం గురించి మాట్లాడే చంద్రబాబు ఐటీ నోటీసుల విషయంలో ఇప్పుడు ఎక్కడ తాకట్టు పెట్టారని ప్రశ్నించారు. ఐటీ నోటీసుల విషయంలో చంద్రబాబు అరెస్ట్ అవుతారని నందిగాం సురేష్ ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడం, ముడుపులు సంపాదించుకోవడమే ఆత్మగౌరవమా? అని అన్నారు.

చంద్రబాబుకు ఐటీ నోటీసులపై దత్తపుత్రుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటోన్నారని నందిగాం సురేష్ నిలదీశారు. ఆయన నోరు విప్పకుండా ముడుపులు అందాయా? అంటూ ప్రశ్నించారు. ఎన్ని కోట్ల ప్యాకేజీ పవన్ కల్యాణ్‌కు అందిందో బయటపెట్టాలని డిమాాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ నిద్ర మేల్కోవాలని, చంద్రబాబును ప్రశ్నించాలని నందిగాం సురేష్ డిమాండ్ చేశారు.