AP

రామోజీ పేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్.. చివరికి ఆయన పైనే బండలు

బయట నుంచి చెరువులోకి రాళ్లు వేయడం చాలా ఈజీ.. అదే చెరువులో ఉంటే సాధ్యం కాదు. చాలామంది మొదటి విధానాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు రామోజీరావు విషయంలో చేస్తున్నది అదే.

ఎప్పుడో పచ్చళ్ళ వ్యాపారంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. మీడియా మొగల్ గా అవతరించారు. అయితే ఆయనే కరెక్ట్ అని చెప్పలేము కానీ.. వేలాదిమందికి ఉపాధి బాట కల్పించారు. తమకు తాము మేధావులుగా భావించే ఎంతోమంది జర్నలిస్టులకు ఆశ్రయం కల్పించారు. ఇటువంటి వారే ఇప్పుడు రామోజీరావుని విమర్శించడం విశేషం.

గత కొద్దిరోజులుగా రామోజీరావు, మార్గదర్శి,ఈనాడు విషయంలో కొంతమంది సోషల్ మీడియా నిపుణులు కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇలా వ్యాఖ్యానాలు చేస్తున్న వారి పూర్వశ్రమం ఈనాడు , యజమాని రామోజీ రావే కావడం విశేషం. ఆయన పెంచి పోషించిన వారే ఇప్పుడు పాములా కాటేస్తున్నారు. పెద్ద పెద్ద బండ రాళ్లు వేస్తున్నారు. ఏపీలో ఇప్పుడు నికార్శైన జర్నలిస్టులుగా భావిస్తున్న వారి పూర్వశ్రమం ఈనాడే. చాలా మీడియా సంస్థల్లో మంచి మంచి పొజిషన్లో ఉన్న వారంతా ఈనాడు జర్నలిజం స్కూలుకు చెందినవారే. వారేమీ పుట్టుకతో లబ్ద ప్రతిష్టులు కాదు. వారిని ఎంపిక చేసి.. సొంత డబ్బులు ఖర్చు పెట్టి.. జీతాలు ఇచ్చి మరి సాన పెట్టారు. వారిలో నైపుణ్యం పెంచారు. అటువంటి వారే ఇప్పుడు రామోజీ దోచేశాడంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఏకపక్షంగా విశ్లేషణలు సాగిస్తున్నారు. ఆయన సంస్థ లో ఉన్నప్పుడు ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడే వారంతా బండరాళ్లు వేస్తున్నారు.

వాస్తవానికి రామోజీరావు చాలా రకాల వ్యాపారాలు చేశారు. కొన్నింట మాత్రమే సక్సెస్ అయ్యారు. అయితే ఆయనకు ఫెయిల్యూర్స్ సైతం ఉన్నాయి. న్యూస్ టైమ్ అనే ఇంగ్లీష్ పత్రికను పెట్టి నడపలేక మూసేశారు. వాటితో పాటు ఎన్నో రకాల పరిశ్రమలు మూతపడ్డాయి. వాటిలో పని చేసే సిబ్బందికి సెటిల్ చేశారు. అణా పైసలతో సహా తేల్చేశారు. మీడియా రంగంలో చాలా యాజమాన్యాలు రాత్రికి రాత్రే సిబ్బందికి శ్రీముఖాలు ఇస్తున్నాయి. కనీసం పనిచేసే సమయానికి జీతాలు కూడా చెల్లించడం లేదు. అటువంటి సంస్థలేవీ ఈ కుహనా జర్నలిస్టులకు కనిపించకపోవడం విచారకరం. రామోజీరావు పక్క నిబంధనలతో వ్యాపారాలు చేస్తున్నాడని సమర్థించలేము కానీ.. ఉన్నంతలో తన వద్ద పనిచేసే వారికి న్యాయం చేస్తున్నారని సంతృప్తి ఉంది.

చాలామంది ఈనాడులో పనిచేసిన జర్నలిస్టులు మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఈనాడు పేరు చెప్పి బతికేస్తున్న వారు ఉన్నారు. ఆ సంస్థ బ్రాండ్ పేరు చెప్పి అధిక జీతాలు దక్కించుకున్న వారు ఉన్నారు. తమకు తాము గొప్ప ప్రతిభావంతులమన్న భావన వారిది. అయితే తాము బతకడానికి ఉపయోగించే ఈనాడు బ్రాండ్.. పని విషయంలో మాత్రం చూపరు. అటు పూర్వం అధినేత రామోజీరావుని గౌరవించరు. ఇలాంటి వారిని చూస్తే సమాజంలో కృతజ్ఞత అనే మాట నిషేధిత వస్తువుగా మారిపోయిందని అనిపిస్తుంది.