APTELANGANA

విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం

విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా? ఆయన పార్టీ మారడం ఖాయమా? అయితే ఏ పార్టీలో చేరుతారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది.

గత కొద్దిరోజులుగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న నాని టిడిపి కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అడపాదడపా నాయకత్వం పై కామెంట్స్ వినిపిస్తున్నారు. అయినా హై కమాండ్ లైట్ తీసుకుంటూ వస్తోంది. దీంతో తన దారి తాను చూసుకోవాలని కేశినేని నాని తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడు ఎంపీ స్థానాలు దక్కించుకుంది. శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని గెలుపొందారు. అయితే రెండోసారి గెలిచిన తర్వాత నాని వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. స్థానిక టిడిపి నాయకులతో విభేదాలు వెల్లువెత్తాయి. వారిని కట్టడి చేయాలని నాని నాయకత్వాన్ని కోరుతూ వస్తున్నా ఫలితం లేకపోయింది. పైగా వారికే ప్రోత్సాహం అందిస్తున్నట్లు నాని అనుమానిస్తున్నారు. అందుకే ఇన్నాళ్లు పార్టీకి ఆంటీ ముట్టినట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు తాడోపేడో నిర్ణయించుకోవాలని డిసైడ్ అయ్యారు.

టిడిపి యువ నేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పాదయాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. అయితే పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపి నాని మాత్రం యాత్రకు దూరంగా ఉన్నారు. తాను వ్యతిరేకిస్తున్న నాయకులు యాత్ర నిర్వహణ బాధ్యతలు చూస్తుండడమే అందుకు కారణం. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తి పథకం కింద ఓ కార్యక్రమాన్ని చేపడుతోంది. దానిలో భాగంగా తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో కొండపల్లి బొమ్మల తయారీ, వాటి విక్రయాలకు సంబంధించి భవన సముదాయం నిర్మించారు. దీనిని కేశినేని నాని ప్రారంభించనున్నారు. అయితే దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో ఎక్కడ కూడా టిడిపి అని పేరు లేకుండా జాగ్రత్తగా పడ్డారు. దీంతో నాని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది.

కృష్ణా జిల్లాకు చెందిన టిడిపి నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా తో కేశినేని నానికి విభేదాలు ఉన్నాయి. వారంతా లోకేష్ టీమ్ అన్న ప్రచారం ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తనను కాదని.. తమ్ముడు కేశినేని చిన్నికి విజయవాడ పార్లమెంట్ సీటును కేటాయిస్తారని టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే లోకేష్ యాత్రను చిన్ని పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఇది నాని ఆగ్రహానికి కారణం అవుతోంది. అందుకే పార్టీకి అల్టిమేట్ ఇవ్వాలని భావిస్తున్నారు. వైసీపీ నుంచి ఆహ్వానాలు వస్తుండడంతో సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. అటు తెలుగుదేశం వర్గాలు సైతం కేశినేని నాని విషయంలో లైట్ తీసుకుంటున్నాయి. దీంతో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంటుంది