AP

జగన్‌కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు..

సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడటంతో వైసీపీ నేతలు, కౌన్సిలర్లపై ప్రతిపక్షాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. దీనిలో భాగంగానే నందిగామ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు ఇప్పటికే టీడీపీ గూటికి చేరారు. కేశినేని చిన్ని సమక్షంలో వీరు టీడీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నపిఠాపురం నియోజకవర్గంలో 8 మంది వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది.

 

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల విషయంలో తలెత్తిన వివాదం కౌన్సిలర్ల రాజీనామా వరకు దారి తీసిందని తెలుస్తోంది.ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం గురించి కౌన్సిలర్లకు ఎటువంటి సమాచారం లేకుండానే ఈ మొత్తం వ్యవహారాన్ని పూర్తి చేశారని వారు ఆరోపిస్తున్నారు. తమకు కనీస సమాచారం లేకుండా ఎలా ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేస్తారని వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఓ ప్రజాప్రతినిధి ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు.

 

ఇదిలా ఉంటే ఔట్ సోర్సింగ్ పోస్టులను న్యాయపరంగానే భర్తీ చేశామని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ కంటే ముందే నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులకు పోస్టింగ్‌ ఇచ్చామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే దీని వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు, ఓ మంత్రి ఉన్నారని ..వారు ఇచ్చిన సిఫార్సు లేఖల ఆధారంగానే ఉద్యోగులను నియమించారని తెలుస్తోంది.

 

దీన్ని వ్యతిరేకిస్తూ 8 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్దపడ్డారని తెలుస్తోంది. వెంటనే అప్రమత్తం అయిన పార్టీ అధిష్టానం దీనిపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే వైసీపీ కౌన్సిలర్లతో పిఠాపురం అభ్యర్థి వంగా గీతతో పాటు, ముద్రగడ పద్మనాభం చర్చలు జరుపుతున్నారు. ఈ ఘటనపై చర్చించి తగు చర్యలు తీసుకుంటామని వైసీపీ కౌన్సిలర్లకు భరోసా ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో గెలుపు కీలకం కావడంతో ఈ చిన్న అవకాశాన్ని ప్రత్యర్థులకు ఇవ్వకూడదని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.