AP

జగన్ కామెంట్స్ కు సునీత కౌంటర్- మళ్లీ సానుభూతి డ్రామా-ఓటేయొద్దని పిలుపు..!

ఏపీలో ఎన్నికల వేళ మరోసారి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం తెరపైకి వస్తోంది. ఐదేళ్లుగా అధికారంలో ఉన్నా వివేకా హత్యను కొలిక్కి తీసుకురాలేకపోయారని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం వైఎస్ జగన్ నిన్న ప్రొద్దుటూరులో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముఖ్యంగా వివేకా హత్యలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకుని ప్రచారం చేస్తూ వివేకా హంతకులు బయటే తిరుగుతున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.

 

జగన్ కామెంట్స్ పై ఇవాళ ఆయన సోదరి, వివేకా కుమార్తె సునీతారెడ్డి స్పందించారు. తెలంగాణ హైకోర్టులో దస్తగిరి పిటిషన్ పై విచారణ సందర్భంగా హాజరైన ఆమె.. బంధుత్వాలకు అర్ధం తెలుసా అంటూ ప్రశ్నించారు. చిన్నాన్న అంటే నాన్నతో సమానమని, ⁠చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధారించలేదని ఆమె ఆరోపించారు. ⁠చిన్నాన్న కుమార్తె పైనే నిందలు వేయడం న్యాయమా అని జగన్ వ్యాఖ్యలను ఆక్షేపించారు.

⁠మీ చెల్లి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటని జగన్ ను ప్రశ్నించారు. ⁠నాపైనే కేసులు పెట్టడం ఏమైనా న్యాయమా అని అడిగారు. ⁠చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు గడిచిందని, ⁠ఐదేళ్లుగా మీ ప్రభుత్వమే ఉన్నా ఏం చేశారని నిలదీశారు. ⁠ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు మాట్లాడటం సరికాదంటూ చురకలు అంటించారు. ⁠మీరు చేయాల్సిన పని సరిగా చేయనందునే బయటకు రావాల్సి వచ్చిందన్నారు. తాను చెప్పేదంతా నిజమని, నాలాగే జగన్ చెప్పగలుగుతారా అని సునీత అడిగారు.

 

⁠వివేకాను ఎవరు చంపారో దేవుడికి తెలుసని జగన్ అంటున్నారని, ⁠వివేకాను హత్య చేసిన వారికి రక్షణ కల్పిస్తున్నారని సునీత ఆరోపించారు. ⁠హత్య చేసిన వ్యక్తి ఎవరు చంపించారో స్పష్టంగా చెబుతున్నారని, ⁠నిందితుల వెనక వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారని సునీత గుర్తుచేశారు. ⁠మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు భద్రత కల్పిస్తున్నారని సునీత ఆక్షేపించారు. ⁠గతంలో మీరే సీబీఐ విచారణ కోరారని, ఇప్పుడు మీరే వద్దన్నారని గుర్తుచేశారు. ⁠మీ పేరు బయటకు వస్తుందని సీబీఐ విచారణ కోరట్లేదా అని జగన్ ను ఆమె ప్రశ్నించారు.

 

⁠నిందితుడిని పక్కన పెట్టుకుని ఓటు వేయాలని కోరుతున్నారంటూ సునీత ఆరోపించారు. ⁠నిందితుడని సీబీఐ చెబుతున్నా ఓటు వేయాలని కోరుతున్నారని ఆక్షేపించారు. ⁠మీ చిన్నాన్నను చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పుగా అనిపించట్లేదా అని జగన్ ను అడిగారు. ⁠ఐదేళ్లు అధికారంలో ఉన్నా కూడా చిన్నాన్న గుర్తురాలేదని, ⁠ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాన్న గుర్తుకు వచ్చారన్నారు. ⁠సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్నను తెరపైకి తెస్తున్నారన్నారు. తాను పోరాడేది న్యాయం కోసమని, మీరు పోరాడేది పదవుల కోసమని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ⁠హంతకులకు ఓటు వేయవద్దని ప్రజలను ఆమె కోరారు.