AP

ప్రధాని మోడీకి వైఎస్ షర్మిల లేఖ..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పీసీసీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కీలకమైన విభజన హామీలపై ఇప్పటికే అన్న వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. పాతికమంది ఎంపీల్ని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న హామీ ఏమైందని, మిగతా హామీలపై కేంద్రం సైలెంట్ గా ఉంటున్నా ఎందుకు అడగటం లేదని సూటిగా నిలదీస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ప్రధాని మోడీకి షర్మిల లేఖ రాశారు. ఇందులో విభజన హామీల నుంచి వైజాగ్ స్టీల్ వరకూ ప్రతీ అంశాన్నీ ప్రస్తావించారు.

 

2014లో రాష్ట్ర విభజన చేసినప్పుడు తెలంగాణతో పోలిస్తే ఏపీ వెనుకబడిపోకూడదన్న ఉద్దేశంతో విభజన చట్టంలో పలు హామీలు ఇచ్చిందని వైఎస్ షర్మిల ప్రధాని మోడీకి గుర్తుచేశారు. ఏపీ వేగంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఇచ్చిన ఆ హామీలు పదేళ్లయినా ఇంకా నెరవేరలేదని, దీంతో రాష్ట్రం రాజధాని లేకుండా మిగిలిపోయిందన్నారు. అప్పట్లో ఎన్డీయే తొలిసారి అధికారం చేపట్టినప్పుడు ఈ హామీలతో పాటు మరికొన్ని కొత్త హామీలు కూడా ఇచ్చారని, కానీ పదేళ్లయినా ఇప్పటికీ అవేవీ నెరవేరలేదని షర్మిల ఆరోపించారు.

 

ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్రం దీనావస్ధకు చేరుకుందని, ప్రజలు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, కాబట్టి ఏపీపై దయ చూపాలని షర్మిల మోడీని కోరారు. ఈ పరిస్ధితికి కేంద్రం వైఫల్యమే కారణమన్నారు. ఇది కేంద్రం విశ్వసనీయతను ప్రశ్నార్దకంగా మారుస్తోందని షర్మిల తెలిపారు. ప్రత్యేక హోదాను స్వయంగా అప్పటి ప్రధాని హామీ ఇచ్చినా తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. దీంతో ఏపీ అభివృద్ధికి దూరంగా ఉండిపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా ఈ కోవలోకే వస్తుందన్నారు. పోలవరం జాతీయ హోదాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పక్కనపెట్టేశాయన్నారు.

 

ఈ సందర్భంగా గతంలో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చి నెరవేరని హామీల జాబితాను కూడా షర్మిల మోడికి రాసిన లేఖలో ప్రస్తావించారు. వీటిని సాధ్యమైనంత త్వరగా నెరవేర్చాలన్నారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కూడా ఆపాలని ప్రధాని మోడీని కోరారు. వీటిపై పార్లమెంట్ బడ్డెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగంలో వీటిపై నిర్దిష్టంగా ప్రస్తావించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.