AP

వైసీపీ ఐదో జాబితాలో ఎమ్మెల్యేలు వీరేనా..?

ఏపీలో అధికార వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారం సుదీర్ఘంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాల్ని విడుదల చేసిన వైసీపీ.. 58 సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని, 10 మంది ఎంపీల్ని మార్చేసింది. వీరిలో పలువురు ఇప్పటికే పార్టీలు కూడా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన జాబితాల్లో పలు సీట్లలో తిరిగి మార్పులకు కూడా వైసీపీ సిద్ధమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు కొత్తగా ఈ జాబితాలో ఉండబోయే వారిపై చర్చ జరుగుతోంది.

 

వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా త్వరలో విడుదల కాబోతున్న జాబితాలో ఉంటాయని భావిస్తున్న ఎమ్మెల్యేల్లో పలువురికి ఇప్పటికే సీఎంవో నుంచి కాల్స్ వెళ్తున్నాయి. దీంతో వీరంతా సీఎంవో అధికారులతో భేటీ అవుతున్నారు. వీరిలో పలువురు అవసరాన్ని బట్టి సీఎం జగన్ ను కూడా కలుస్తున్నారు. మరికొందరు ఒకటికి రెండు, మూడు సార్లు కూడా సీఎం జగన్ తో భేటీ అవుతున్నారు. అయినా వీరి స్ధానాలపై క్లారిటీ రావడం లేదు.

 

 

ఈ నేపథ్యంలో వైసీపీ ఐదో జాబితాలో ఉంటారని భావిస్తున్న ఎమ్మెల్యేల జాబితాలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, బాలి నేని శ్రీనివాసరెడ్డి, మంత్రులు గుడివాడ అమర్ నాథ్, ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బుర్రా మధుసూధన్ యాదవ్, ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ఇవాళ సీఎం జగన్ ను కలిశారు. వీరితో పాటు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఇవాళ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. దీంతో ఆయా స్ధానాల్లో మార్పులు చేర్పులు తప్పవని తేలిపోయింది.

 

ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలుకు బదులు గిద్దలూరులో పోటీ చేయాలని వైసీపీ నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. అలాగే ఆయన అడిగిన రెండు సీట్ల మార్పుల్నీ సీఎం జగన్ ఇప్పటికే తిరస్కరించారు. అలాగే ఒంగోలు ఎంపీ సీటులోనూ మాగుంట శ్రీనివాసులరెడ్డికే ఇవ్వాలని కోరినా అంగీకరించలేదు. చివరికి తన కుమారుడు బాలినేని ప్రణీత్ కు అవకాశం ఇవ్వాలని కోరినా ఆంగీకరించలేదు. దీంతో బాలినేని పార్టీ మారిపోవడం తప్ప మరో మార్గం లేదన్న ప్రచారం జరుగుతోంది.