కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఎంపీ కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి. తాజాగా, మరో బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు.
తాను వరంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కావ్య లేఖ రాశారు. బీఆర్ఎస్ నుంచి పోటీకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలు, అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం .. పార్టీ ప్రతిష్టను దిగజార్చాయన్నారు. జిల్లా నేతల మధ్య సమన్వయం సహకారం కొరవడ్డాయన్నారు.
ఎవరికి వారే అన్నట్లు పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు కావ్య తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యకర్తలు తనను మన్నించాలని ఆ లేఖలో కావ్య పేర్కొన్నారు. కాగా, కడియం శ్రీహరితోపాటు కావ్య కూడా రేపు అంటే శుక్రవారం కాంగ్రెస్ పార్టీలోచేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేగాక, కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య బరిలో దిగనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో కడియం శ్రీహరితో ఈ విషయంపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే కడియం శ్రీహరి, కావ్య గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
వరంగల్ జిల్లా నుంచి బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న కడియం శ్రీహరి పార్టీని వీడటం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టమేనని చెప్పాలి. అంతేగాక, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస పార్టీలో చేరుతుండటం ఆసక్తికరంగా మారింది.