AP

ఏపీ హైఅలర్ట్: అన్ని జిల్లాల ఎస్పీలకు తక్షణ ఆదేశాలు- 144 సెక్షన్

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు..

తగిన సాక్ష్యాధారాలతో సహా.

ఈ ఉదయం ఆయనను విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్‌పై సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలను వినిపించారు.

చంద్రబాబు తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీభవించలేదు. వందల కోట్ల రూపాయల మేర కుంభకోణంతో ముడిపడి ఉన్న కేసు కావడం వల్ల ప్రధాన నిందితుడు, ఏ1 చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యులు, సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించారు. చంద్రబాబు దాఖలు చేసుకున్న దరఖాస్తును కొట్టివేశారు. 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలిస్తూ తీర్పు జారీ చేశారు.

దీని తరువాత రాష్ట్రంలో శరవేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు, ప్రభుత్వ ఆస్తులపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని భావించింది. హై అలర్ట్ ప్రకటించింది.

ఈ మేరకు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్.. అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లకూ తక్షణ ఆదేశాలను జారీ చేశారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.

బంద్‌, రాస్తారోకోలు, రాజకీయ సమావేశాలకు అనుమతులు లేవని, దీన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. అలాంటి సమావేశాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తే ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు గానీ, సభలను గానీ నిర్వహించకూడదు.

మండల స్థాయిలో పోలీసుల నిఘా విస్తృతం కావాల్సి ఉంటుందని రాష్ట్ర డీజీపీ కార్యాలయం జిల్లా ఎస్పీలకు ఆదేశించింది. దాడులు, ప్రతిదాడులు జరగకూడదని, అలాంటి ఘటనలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని సూచించింది. సామాన్య ప్రజల రోజువారీ జీవనానికి ఎలాంటి విఘాతం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది.