ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల తాకిడి పెరిగింది.
ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. నడక మార్గాలన్నీ రద్దీగా మారుతున్నాయి.
బుధవారం 74,884 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,213 మంది తలనీలాలను సమర్పించారు. గరుడ సేవ తరువాత భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూలైన్ ఉంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
శ్రీవారి బ్రహ్మోత్సవా సందర్భంగా బంగారు గొడుగు ఉత్సవాన్ని టీటీడీ అధికారులు వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీవారి రథోత్సవానికి ముందురోజు సాయంత్రం బంగారు గొడుగు వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఈ సాయంత్రం భక్తుల కోలాహలం మధ్య పూర్తి చేశారు. శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది నూతన ఛత్రస్థాపనాన్ని నిర్వహించారు.
ప్రధాన కల్యాణకట్టలో బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, కార్యనిర్వాహణాధికారి ఏవీ ధర్మారెడ్డి బంగారు గొడుగును వారికి అప్పగించారు. తిరుమలలో మొట్టమొదటి కళ్యాణ కట్టను ఏర్పాటుచేసి యాత్రికులకు తలనీలాలు సమర్పించుకునే వసతి కల్పించిన పంతులు గారి వంశస్థులు వంశపారంపర్యంగా శ్రీవారి రథానికి గొడుగు సమర్పించడం ఆచారంగా వస్తోంది.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రారంభమైన ఈ ఆచారం ఆ తర్వాత మహంతుల పాలనలో కూడా కొనసాగింది. 1946వ సంవత్సరంలో పంతులు వంశస్తులైన ధర్మకర్త శివరామయ్య, టీటీడీకి మధ్య జరిగిన ఒప్పందం మేరకు కళ్యాణకట్టను టీటీడీకి అప్పగించారు. అప్పట్లో జరిగిన ఒప్పందం మేరకు స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంలో పంతులు వంశస్థులు బంగారు గొడుగుకు పూజలు నిర్వహిస్తారు.
తిరుమాడ వీధుల గుండా ఊరేగింపుగా ఈ గొడుగును తీసుకెళ్లి స్వామివారి రథంపై ప్రతిష్ఠిస్తారు. పంతులు వంశస్తులైన శివరామయ్య కుమారుడు రామనాథన్ 39 సంవత్సరాల నుంచి బంగారు గొడుగులకు పూజలు నిర్వహించి కళ్యాణకట్ట నుండి నాలుగుమాడ గుండా మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్ళి స్వామివారి రథానికి సమర్పిస్తూ వస్తోన్నారు.