AP

పార్వేట మంటపం చుట్టూ ఏపీ రాజకీయం.. ముదురుతున్న వివాదం..

తిరుపతిలో టీటీడీ వర్సెస్‌ బీజేపీ వ్యవహారం మరింత ముదురుతోంది. పార్వేట మండపం చుట్టూ జరుగుతున్న వివాదంపై సవాళ్లు ప్రతిసవాళ్లతో ఈ రగడ మరింత రాజుకుంటోంది. ధైర్యం ఉంటే పార్వేటి మండపం వద్దకు వచ్చి నిర్మాణం బాగాలేదని చెప్పగలరా అంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించారు బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి. మంటపంపై చర్చకు సిద్ధమన్న ఆయన.. అందుకు సమయం, తేదీ చెబితే ఆర్కాలజీ అధికారులతో సహా అన్ని ఆధారాలతో వస్తామన్నారు. ఈ సందర్భంగా టీటీడీ తీరుపై ఆయన మండిపడ్డారు.

 

ఇక ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా టీటీడీ తీరుపై ఫైర్ అయ్యారు. పునరుద్ధరణ పనుల్లో భాగంగా పార్వేట మండపాన్ని తొలగించడం సరికాదని ధ్వజమెత్తారు. 75 ఏళ్లకుపైగా ఉన్న కట్టడాలను ఏఎస్‌ఐ అనుమతితోనే, వారి పర్యవేక్షణలో మాత్రమే జరిపించాల్సి ఉంది. 500ల ఏళ్లుకు పైబడి ఉన్న పార్వేటి మంటపాన్ని ఇష్టానుసారంగా తొలగిస్తే బీజేపీ ఒప్పుకోదని ఈ చర్యలపై పోరాడాతమని ఆమె హెచ్చరించారు.

 

పని కట్టుకుని మరీ పార్వేటి మండపంపై వివాదం చేస్తున్నారని బీజేపీ నేతలపై సీరియస్‌ అయ్యారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. మండపం పొరపాటున పడిపోతే దాని వల్ల జరిగే కలిగే హానిని వారు భరిస్తారా అని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే మండపం వద్దకు వచ్చి.. పాత మండపం బాగుందా, కొత్త మండం బాగుందా అనేది చెప్పాలని ధర్మారెడ్డి సవాల్‌ విసిరారు.