ఈ ఏడాది మొహమాటంగా పలకరించిన నైరుతి రుతుపవనాలు అరకొర వర్షపాతం తర్వాత వెనక్కి మళ్లడం ప్రారంభించాయి. రాజస్తాన్ నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ ఇవాళ ప్రకటించింది.
గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో 5 శాతం లోటు వర్షపాతం నమోదుచేసిన రుతుపవనాలు.. వారం రోజులు ఆలస్యంగా వెనక్కి మళ్లుతున్నట్లు ఐఎండీ తెలిపింది.
దేశవ్యాప్తంగా జూన్ నెలలోనే నైరుతి రుతుపవన వర్షాలు పలకరించాల్సి ఉండగా.. ఆలస్యంగా జూలైలో అవి విస్తరించాయి. ఆ తర్వాత కూడా వర్షపాతం స్ధిరంగా నమోదు కాలేదు. జూలైలో దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలతో అక్కడక్కడ వర్షాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆగస్టులో కాస్త మెరుగుపడినా తక్కువ వర్షపాతమే నమోదైంది. ఆ తర్వాత సెప్టెంబర్లో చాలా చోట్ల పూర్తి స్ధాయిలో వర్షాలు కురిసినా మొత్తం మీద 5 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది.
ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల ముగింపు ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం ఇవాళ వెల్లడించింది. సెప్టెంబర్ 25న పశ్చిమ రాజస్థాన్ నుండి రుతుపవనాల ఉపసంహరణ అవుతున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి సెప్టెంబర్ 17న ఈ ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా.. వారం రోజులు ఆలస్యమైనట్లు పేర్కొంది. రాజస్తాన్ నుంచి తదుపరి దశలో మిగతా రాష్ట్రాల నుంచి కూడా రుతుపవనాల ఉపసంహరణ సాగనుంది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావంతో ఆగస్టులోనూ కరవు ఛాయలు కనిపించాయి. ఆగస్టులో దేశవ్యాప్తంగా 36 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ పేర్కొంది. అయితే సెప్టెంబరులో అధిక వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్లో సాధారణం కంటే దాదాపు 16 శాతం ఎక్కువ నమోదైంది. భారతదేశంలోని తూర్పు, ఈశాన్య భారతదేశం మినహా చాలా ప్రాంతాలలో ఈ నెలలో కురిసిన వర్షాలతో దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు చాలావరకు తగ్గింది.