AP

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. స్వామివారి ప్రధాన ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన కానుకలను రేపు టెండర్ కమ్ వేలం వేయనున్నారు.

కొత్తవాటితోపాటు పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 14 లాట్ల వరకు ఉన్నాయి. వీటిల్లో ధోతీలు, ఆర్ట్ సిల్క్ చీరలు, నైలాన్, నైలెక్స్ చీరలు, లుంగీలు, క్లాత్ బిట్స్, ఆర్డినరీ టవల్స్.. వగైరా వగైరా ఉన్నాయి. వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని, 0877-2264429 ఫోన్ నెంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org / www.konugolu.ap.govt.in ద్వారా సంప్రదించవచ్చు.

తిరుమలలో గురువారం అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఉదయం 6.00 గంటలకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీభూ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామివారి పుష్కరిణిలో అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు చేశారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించడంతోపాటు ఉత్సవర్లను ఆలయం నుంచి యాగశాలకు వేంచేపు చేశారు. తర్వాత ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్రప్రతిష్ఠ జరిగాయి. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం జరిగింది. పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు , వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేసి అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.