అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని దక్షిణ రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది.
వర్షాల తీవ్రత మరో 48 గంటల పాటు ఉండొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ మధ్యాహ్నం నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆకాశం మేఘావృత్తమై కనిపించింది. సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.
పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి పుట్టపర్తి, కడప జిల్లాల్లో అక్కడక్కడ తెలికపాటి వర్షం పడింది. ఇదే తీవ్రత మరిన్ని రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తు నిర్వహణ విభాగం అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొన్నాయి.
పిడుగులు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. నర్సీపట్నం, అనకాపల్లిల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. నర్సీపట్నంలో 90 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. అనకాపల్లిలో 88 మిల్లీమీటర్ల మేర వర్షం పడింది. వినుకొండ, పల్నాడు జిల్లాల్లో 77, బొబ్బిలి, విజయనగరంలల్లో 69 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.