ఏపీలో టీడీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ నెల 4న విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది.
ఈ కేసులో నారాయణ హైకోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. ఈ సమయంలోనే సీఐడీ నోటీసులు జారీ చేసింది. లోకేశ్ ను విచారణకు పిలిచిన సమయంలోనే ఇప్పుడు సీఐడీ నారాయణకు నోటీసులు ఇచ్చింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో ఏ2గా ఉన్న నారాయణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారు. తాజాగా ఈ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుతో పాటుగా లోకేశ్ పేర్లను చేర్చింది. ఇదే కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 41ఏ నోటీసులు జారీ చేయాలని హైకోర్టు సూచనలతో సీఐడీ తాజాగా లోకేశ్ కు నోటీసులు అందించింది. ఈ నెల 4న విచారణకు రావాలని పేర్కొంది. ఇదే సమయంలో ఇప్పుడు నారాయణకు అదే సమయంలో విచారణ రావాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. నారాయణ ఇప్పటికే ఇదే కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.
ఇప్పుడు ఒకటే కేసులో మాజీ మంత్రులుగా ఉన్న లోకేశ్..నారాయణ కు సీఐడీ నోటీసులు జారీ చేయటం..ఒకే సమయం కేటాయించటం ద్వారా ఇద్దరినీ కలిపి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వ సమయంలో అమరావతి మాస్టర్ ప్లాన్ లో అక్రమాలు జరిగాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసారు. ఇందులో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ పేరిట జరిగిన భారీ అవినతి దర్యాప్తులో వెలుగు చూసింది. ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా మాజీ మంత్రి నారాక్ష్న పేరును సీఐడీ ఈ కేసులో చేర్చింది. ఇక, ఇప్పుడు నారాయణకు నోటీసులు జారీ చేయటంతో.. అటు చంద్రబాబు కేసులో హైకోర్టులో విచారణ..ఆ మరుసటి రోజునే విచారణకు సీఐడీ నోటీసులు ఇవ్వటంతో జరిగే పరిణామాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.