నాలుగో విడత వారాహి యాత్ర సక్సెస్ అయినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో సమస్యలు తనకెంతో బాధ కలిగించినట్లు పవన్ తెలిపారు.
ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంటూరు మార్పు అంశం తీవ్రంగా బాధించిందన్నారు. అలాగే బందరులో జరిగిన జనవాణి కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య తన దృష్టికి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని నడిపించే అఖిలభారత సర్వీసు అధికారులకు కూడా నెల దాటినా జీతాలు రావడం లేదన్నారు. మాజీ ఐఏఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తనకు పెన్షన్ కూడా సకాలంలో రావడం లేదన్నారు.
రాష్ట్రంలో ఇంత అసమర్ధ ప్రభుత్వం ఉందని, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇన్నేళ్లుగా జనసేన పలు సమస్యలపై ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నిస్తున్నా సీఎం జగన్ మౌనంగా ఉండిపోతున్నారన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన వైసీపీ సహజ గుణం అయిపోయిందన్నారు. అందుకే వీటికి చరమాంకం పలకాలని భావించామన్నారు. ఈ పరిస్ధితుల్లో ప్రశ్నించిన టీడీపీ, జనసేన నేతలపై హత్యాయత్నం వరకూ కేసులు పెట్టారన్నారు. ఇవన్నీ ఈ మధ్య కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ఏపీలో ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరామన్నారు.
బీజేపీతో పొత్తు తెగిపోయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, మేం ఎవరితో పొత్తు పెట్టుకున్నామన్నది వైసీపీకి అనవసరం అన్నారు. మా పొత్తుల సంగతి మేం చూసుకుంటామన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు కావాలని గతంలో కోరామని, తాజాగా ప్రధాని దీన్ని ప్రకటించారన్నారు. ఢిల్లీకి సీఎం జగన్ వెళ్లినప్పుడు జీడి బోర్డు, కొబ్బరి బోర్డు గురించి ప్రశ్నించాలన్నారు. ఇంతమంది ఎంపీల్ని పెట్టుకుని సీబీఐ కేసులు వాయిదా వేయించుకోవడం కాకుండా వీటిపై ప్రశ్నించాలని జగన్ కు సూచించారు.
తాము ఎన్డీయేలో ఉన్నామని, తాజాగా కూటమి భేటీకి కూడా వెళ్లామని పవన్ గుర్తుచేశారు. అక్కడ మోడీని తిరిగి ప్రధాని చేయాలన్న వాదనకు మద్దతు పలికామన్నారు. జనసేన-బీజేపీ-టీడీపీ కూటమి 2024 ఎన్నికలకు కలిసి వెళ్లాలనేది తమ ఆకాంక్ష అని పవన్ తెలిపారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు నడ్డా ఇంటికెళ్లి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పానన్నారు. ఈ ప్రకటన ఢిల్లీలోనే రావాల్సిందన్నారు. జీ20 సదస్సులో కేంద్రం బిజీగా ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్టు చేశారన్నారు.జనసేన-బీజేపీ కమిటీ యాక్షన్ లోనే ఉందని, ఈ క్రమంలో టీడీపీ-జనసేన పొత్తు ప్రకటించాను కాబట్టి మరో జాయింట్ యాక్షన్ కమిటీ అవసరం అయిందన్నారు.
నాదెండ్ల మనోహర్, బొమ్మిడి నాయకర్, బి.మహేందర్ రెడ్డి, కందుల దుర్గేష్, పాలవలస యశస్వినితో ఐదుగురు సభ్యుల్ని టీడీపీతో జాయింట్ యాక్షన్ కమిటీకి ప్రతిపాదించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించి ఓ ప్రకటన చేస్తారన్నారు.