AP

వైసీపీది ధనబలం, టీడీపీది ప్రజాబలం.. ఈ ప్రభుత్వం పని అయిపోయింది..!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ధనబలం, తెలుగుదేశం పార్టీది ప్రజాబలం.. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం పని అయిపోతుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి..

శ్రీకాళహస్తిలో నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి ప్రసంగిస్తూ.. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం, చంద్రబాబు ఆత్మవిశ్వాసం తెచ్చారన్నారు.. 49 రోజులుగా చంద్రబాబును జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు..చంద్రబాబు నాయుడు అవినీతి చేశారని ప్రజలు నమ్మడం లేదన్న ఆమె.. పరిశ్రమలు ఏర్పాటు చేయటం తప్పా..? అమరావతి రాజధాని నిర్మించడం తప్పా…? పోలవరం కట్టడం తప్పా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, ఏపీ అంటే అరాచకం, అప్పుల రాష్ట్రం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మళ్లీ చంద్రబాబు బయటకు వచ్చి మరింత ఉత్సాహంగా ప్రజల కోసం పనిచేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.. రాబోయే కురుక్షేత్ర యుద్దంలో టీడీపీ, జనసేన కూటమి విజయం తధ్యం అనే జోస్యం చెప్పారు నారా భువనేశ్వరి.

 

అభివృద్ధికి పాటుపడటమేనా చంద్రబాబు చేసిన నేరం? రాష్ట్రమే కుటుంబంగా 45 ఏళ్లుగా అభివృద్ధికి పాటుపడటమేనా చంద్రబాబు చేసిన నేరం. తన విజన్ తో ఐటీ రంగానికి ప్రోత్సాహం అందించి యువతకి ఉద్యోగాలు కల్పించడమే చంద్రబాబు చేసిన పాపమా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు నారా భువనేశ్వరి.. ప్రజలు, కార్యకర్తలు నా మీద చూపిస్తున్న ప్రేమ, అభిమానాలే ఈ పోరాటంలో నాకు శ్రీరామరక్షగా అభివర్ణించారు నారా భువనేశ్వరి. ఇక, చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక మృతిచెందినవాళ్ల కుటుంబాలను పరామర్‌శించి.. టీడీపీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు నారా భువనేశ్వరి.. నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి యాత్రకు పూనుకున్న విషయం విదితమే.