AP

సమస్యలపై పెద్దఎత్తున కదం తొక్కిన అంగన్వాడీలు

 

ఏలూరు (కలెక్టరేట్),ఫిబ్రవరి – 6: సమస్యల పరిష్కారం కోసం ప్రతి అంగన్వాడీ కార్యకర్త వీరనారి ఝాన్సీరాణిల పోరాడాలని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల యం.ఎల్.సి.షేక్ సాబ్జి అన్నారు.ఈ మేరకు సోమవారం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక జ్యూట్ మిల్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన సాగింది.అనంతరం జరిగిన ధర్నాకు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ హసీనా అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా షేక్ సాబ్జి పాల్గొని ప్రశాంగించారు.అనంతరం కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ కు వినతిపత్రం అందజేశారు.

సాబ్జి మాట్లాడుతూ పోరాడితే పోయేదేమీ లేదు అంగన్వాడీల సమస్యలు పరిస్కారమౌతాయని అన్నారు.పాదయాత్రలో కనిపించిన ప్రతిఒక్కరికి ముద్దులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి నేడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయమని ప్రశ్నిస్తున్న వాళ్ళను బెదిరించడం సిగ్గు చేటన్నారు.ఈ ప్రభుత్వాన్ని దించితేనే సమస్యలు పరిస్కారమౌతాయన్నారు.అప్పటివరకు పోరాటాన్ని కొనసాగించాలని కోరారు.వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకానికి కేటాయించే మెనూ చార్జీకి చాకోలెట్ కూడా రాదన్నారు.పిఆర్సి అమలు చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులను,పర్మినెంట్ చేస్తామని కాంట్రాక్ట్ & ఔట్ సోర్చింగ్ ఉద్యోగులను ఈ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందన్నారు.వ్యక్తిగతంగా 34 కేసులున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమన్నారు.రాజ్యాంగానికి విరుద్ధంగా సలహాదారులను నియమించుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీల సమస్యలపై శాసన మండలిలో గళం విప్పుతామని హామీ ఇచ్చారు.అంగన్వాడీల ఐక్యతను చూసి ప్రభుత్వం భయపడుతుందన్నారు.

సిఐటియు జిల్లా అధ్యక్షులు & ప్రధాన కార్యదర్శులు ఆర్.లింగరాజు,డి.ఎన్.వి.డి.ప్రసాద్ లు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక అంగన్వాడీలను వివిధ తనిఖీల పేర్లతో వేధించడం సిగ్గు చేటన్నారు.16 కార్లు వేసుకుని అంగన్వాడీలను సందర్శిస్తున్న పుడ్ కమీషన్ ఛైర్మన్ అంగన్వాడీలను అవమానిస్తే సహించేది లేదన్నారు.ఈ ప్రభుత్వంలో ఒక్క సమస్య కూడా పరిస్కారం కాలేదన్నారు.పైగా రాజకీయ వేధింపులు తీవ్రంగా పెరిగాయన్నారు.వేయి రూపాయల జీతం పెంచి అంగన్వాడీల సంక్షేమానికి ఎసరు పెట్టారన్నారు.రైతాంగానికి వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను త్రిప్పికొట్టడానికి రైతాంగం చేసిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని,గ్రాట్యూటీ అమలు చేయాలని,పేస్ యాప్ రద్ధు చేయాలని,అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని,ఫించన్ తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని,రాజకీయ వేధింపులు ఆపాలని,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వి.నర్సింహారావు,ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవిన్యూ సహాయకుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మజీ,కోశాధికారి గంగాధర్ లు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.సోమయ్య,జి.రాజు,షేక్ సుభాషిణి,కె.వెంకట్రావు,వి.సాయిబాబా,జె.గోపి,వై.సాయికుమార్,అంగన్వాడీ యూనియన్ లీడర్స్ కె.విజయలక్ష్మి, పి.హైమావతి, పి.సుజాత, పి.ఎల్.ఎస్.కుమారి,బి.జె.ఎన్.కుమారి,తులసి,సరోజిని,రాజకుమారి,చెల్లమ్మ,భవాని,మాణిక్యం,రామలక్ష్మి,రజిని,ఎస్.లత,పుష్ప,రాజమణి,నాగవేణి తదితరులు పాల్గొన్నారు.