నిజం గెలుస్తుంది అన్నది పెద్ద జోక్ అంటూ నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్రపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ..
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చాం.. బడుగు, బలహీన వర్గాలకు చేసిన మేలు చెప్పడానికే సామాజిక సాధికార యాత్ర చేపట్టాం అన్నారు.. ఎన్టీఆర్ బ్రతికి ఉన్న సమయంలో టీడీపీలో బీసీలకు ప్రాధాన్యత ఉంటే ఉండవచ్చు.. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి టీడీపీలో లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అత్యధిక శాతం బీసీలు మంత్రులుగా ఉన్నారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అత్యధిక శాతం బీసీలకే ఇచ్చారని గుర్తుచేశారు.
ఇక, పార్టీలో రెడ్లు ఆధిపత్యం ఏం చేయటం లేదన్నారు మంత్రి బొత్స.. అలా ప్రతిపక్షాలు మాట్లాడుతుంటాయని దుయ్యబట్టారు.. నేను ఎవరికీ సబార్డినేట్ కాదు, నా నెత్తిన ఎవరినీ పెట్టలేదన్న ఆయన.. చంద్రబాబు జైల్లో ఉంటే.. కొడుకు , భార్య తిరుగుతున్నారు.. మిగతా వారు ఎందుకు బయటకు రావడం లేదు..? అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేయలేదా..? దోచుకు తినలేదా? సీమెన్స్ కంపెనీ ఒడంబడిక ఏమైంది..? నిజం గెలుస్తుంది అన్నది పెద్ద జోక్.. ఆధారాలు చూపించకపోతే చంద్రబాబు ఎందుకు నలబై రోజులు జైల్లో ఉంటాడు అని మండిపడ్డారు. వ్యవస్థలు మేనేజ్ చేసి, జిమ్మిక్కులు చేసే వ్యక్తి ఎందుకు జైల్లో ఉన్నాడు.. చంద్రబాబు తప్పు చేశాడు.. దోచుకు తిన్నాడు.. స్కాం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇక, గెలుపు ఓటములు ప్రక్కన పెడితే.. సామాజిక సాధికారత మా నినాదం.. సామాన్యుల ఆర్దిక పరిస్థితి మెరుగు పర్చడం, జీవన పరిస్థితి మెరుగు పర్చడం మా విధానంగా స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యానారాయణ.