AP

టార్గెట్ సీఎం జగన్.. హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్..

వైసీపీ అధినేత సీఎం వైెఎస్ జగన్ ను ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని కోరుతూ ఎ హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ వేశారు. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందన్నారు. ఈ అంశాలను ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒక్కో శాఖల్లో ఎలా అవినీతి జరిగిందో వివరిస్తూ రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్‌ హైకోర్టులో దాఖలు చేశారు.

 

మరోవైపు ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపైనా సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు రఘురామకృష్ణరాజు. ఈ కేసుల్లో విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.

 

ఈ కేసులను సీబీఐ కోర్టు 3,071 సార్లు వాయిదా వేసిందని రఘురామకృష్ణరాజు తెలిపారు. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. వందల కొద్దీ డిశ్చార్జి పిటిషన్లు వేశారని వెల్లడించారు. డిశ్చార్జ్ పిటిషన్లతో కేసు విచారణ జాప్యం జరిగే అవకాశం ఉందిని రఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

 

ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఇలా అటు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పిటిషన్లు వేసి సీఎం జగన్ ను టార్గెట్ చేశారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఈ పిటిషన్ల వ్యవహారం ఏపీలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచుతోంది. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసులు నడుస్తుండగా రఘురామ పిటిషన్లు హాట్ టాపిక్ గా మారాయి.