AP

ఆ సీట్లు టీడీపీ, జనసేనలకు జఠిలమే..

ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధపడుతున్నాయి. ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి.తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఈ సమావేశాలు రచ్చగా మారుతున్నాయి. ప్రధానంగా సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీల నేతల మధ్య వివాదాలు బయటపడుతున్నాయి. అయితే ఒకటి, రెండు చోట్లఅటువంటి పరిస్థితి ఉంటుందని రెండు పార్టీల నాయకత్వాలు ముందే అంచనా వేశాయి. అటువంటిచోట్ల అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాయి. అక్కడ టికెట్ ఆశిస్తున్న రెండు పార్టీల నాయకుల్లో ఒకరికి.. ప్రత్యామ్నాయ అవకాశాలు ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. కొంతమంది నేతలు సర్దుబాటుకు మొగ్గు చూపుతుండగా.. మరికొందరు మాత్రం ససేమిరా అంటున్నారు.

 

More

From Ap politics

అయితే ముఖ్యంగా రెండు పార్టీల్లో కీలక నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో సర్దుబాటు ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై అంతర్గత కసరత్తు జరుగుతోంది. ఎవరికి సీట్లు అనేది మాత్రం బయటకు వెల్లడించడం లేదు. అది ఏమాత్రం బయటకు వచ్చినా రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అందుకే రెండు పార్టీల మధ్య సమన్వయాన్ని పూర్తిచేసి.. పూర్తి అధికంగా ఉన్న నియోజకవర్గాల నేతలను ఒకచోట చేర్చి.. అభ్యర్థిత్వాలను ఖరారు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఎట్టి పరిస్థితుల్లో రెండు పార్టీల్లో ఒక్క నాయకుడిని కూడా వదులుకోకుండా.. ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

 

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం విషయంలో రెండు పార్టీలు ముందడుగు వేశాయి. ఇక్కడ జనసేన పిఎసి అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ఉన్నారు. టిడిపికి సంబంధించి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే మనోహర్ తెనాలి నుంచి బరిలో దిగుతారని సుస్పష్టం. అందుకే చంద్రబాబు రాజేంద్రప్రసాద్ ను ముందుగానే అలెర్ట్ చేశారు. అవసరమైతే మరో చోటుకు మారడానికి సిద్ధపడాలని చంద్రబాబు ఇప్పటికే సూచించినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. రాజేంద్రప్రసాద్ కు గుంటూరు ఎంపీ స్థానానికి పంపిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అక్కడ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ పోటీపైఒక స్పష్టత వచ్చాకే.. తెనాలి సీటు విషయం బహటంగా ప్రకటించే అవకాశం ఉంది.

 

ముఖ్యంగా జనసేనకు బలమున్న ఉభయగోదావరి జిల్లాలో చాలా సీట్ల విషయమై వివాదాలు నడుస్తున్నాయి. మరోవైపు ఇప్పుడున్న సిట్టింగులకు అందరికీ టికెట్లు కేటాయిస్తామని ఇదివరకే చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానానికి టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి పోటీకి సన్నద్ధమవుతున్నారు. అయితే అక్కడ జనసేన కీలక నేత కందుల దుర్గేష్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. జనసేన కూడా ఈ సీటును కోరుకుంటుంది. గట్టిగా పట్టుబడితే ఆ సీటు జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. అదే జరిగితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నర్ధకంగా మిగిలింది. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తన పని తాను చేసుకుంటున్నారు. అక్కడ జనసేన సీటు ఖాయమని తెలుస్తోంది. భీమవరం, కాకినాడ, అమలాపురం, రాజోలు, గాజువాక, పి. గన్నవరం, కైకలూరు, గిద్దలూరు, ఆళ్లగడ్డ, సీట్లు జనసేనకు ఖాయమైనట్లు టాక్ నడుస్తోంది. అయితే అక్కడ టిడిపి నాయకులు సైతం అభ్యర్థిత్వలను ఆశిస్తున్నారు. అటువంటి చోట్ల ఇరు పార్టీలో ఒక నాయకుడికి ప్రత్యామ్నాయం చూపాల్సిన అవసరం ఉంది. ఎంపీగాను, లేకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేట్ పోస్టులు కల్పిస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అందుకు నేతలు అంగీకరిస్తారా? లేదా?అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.