AP

చంద్రబాబుపై సీఐడీ నెక్స్ట్ స్టెప్- హైకోర్టు కీలక ఆదేశాలు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి, స్కిల్ కేసులో బెయిల్ దక్కిన చంద్రబాబు, ఈ నెల 30వ తేదీ నుంచి యధావిధిగా తన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అటు సుప్రీంలో విచారణ పూర్తయిన స్కిల్ క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు పైన నమోదైన ఇతర కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో విచారణ సాగింది. కోర్టు ఈ కేసుల్లో కీలక ఆదేశాలు జారీ చేసింది.

 

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది.సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ వాదనల కోసం ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసును ఈనెల 29న, ఇసుక కేసును ఈనెల 30కి హైకోర్టు వాయిదా వేస్తూ నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చంద్రబాబు విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది.

 

AP High Court posted Chandra Babu Bail petitions hearing for 29th and 30th Nov

అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దని ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగిస్తూ నిర్ణయం వెలువరించింది. మరోవైపు మద్యం కేసులో ఇప్పటికే చంద్రబాబు, ప్రభుత్వం వాదనలు పూర్తి అయ్యాయి. ఈ కేసులో సోమవారం కోర్టు సమయం ముగిసే లోపు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి కూడా వెంటనే తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు ముందస్తు బెయిల్‌ కోసం పెండింగ్‌లో ఉన్న కేసులపై హైకోర్టులో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

 

ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పుడు చంద్రబాబు తో సహా పార్టీ నేతలు సుప్రీంలో స్కిల్ క్వాష్ పిటీషన్ తీర్పు పైన ఆసక్తిగా చూస్తున్నారు. 17ఏ పైన సుప్రీం తీర్పు సానుకూలంగా వస్తే రాజకీయంగా తమది పై చేయి అవుతుందని టీడీపీ భావిస్తోంది. ఇక, ఎన్నికల సమయంలో ఈ కేసుల వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 30వ తేదీ వరకు సీఐడీ చంద్రబాబు కేసుల విషయంలో తదుపరి చర్యలు వద్దని చెప్పటంతో ఇది ఊరటనిచ్చే అంశంగా మారుతోంది.