AP

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నాయి..

ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తు్న్నాయి.. మరోవైపు చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. చంద్రబాబు విషయంలో టీడీపీ ఆందోళన న్యాయమే అన్నారు.. ఒక రాజకీయ నాయకుడు జైల్లో ఉంటే ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు..

 

మరోవైపు.. హామీలను విస్మరించిన ప్రజా ప్రతినిధులను నిలదీయడానికి సీపీఎం ప్రజా పోరుబాట నిర్వహిస్తోందన్నారు శ్రీనివాసరావు.. అనేక ప్రజా సమస్యలను గుర్తించాం.. టిడ్కో ఇళ్లు స్వాధీనం చేయకుండా పతనావస్ధకు తెచ్చారని విమర్శించారు. ఇక, విశాఖపట్నంలో క్యాంప్‌ ఆఫీసు పెట్టి అభివృద్ధి చేస్తారట అని ఎద్దేవా చేశారు. సీఎం ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి చేస్తారా..? అని నిలదీసిన ఆయన.. ఇప్పటికీ విజయవాడ, గుంటూరు, తాడేపల్లి అభివృద్ధి జరగలేదు కదా? అని దుయ్యబట్టారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌తో రాజీపడి ప్రజలపై భారం వేస్తున్నారని విమర్శలు గుప్పించారు. నవంబర్‌ 15వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.. ఆ సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వస్తారని తెలిపారు సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు.