AP

చంద్రబాబు స్కిల్ కేసులో సుప్రీం కీలక ఆదేశాలు – ఆంక్షల కొనసాగింపు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టు తాజాగా ఆంక్షలు విధించింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీని పైన విచారించిన సుప్రీం ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో చంద్రబాబుకు తాజాగా కండీషన్లు విధించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది.

 

సుప్రీంకోర్టు ఆంక్షలు చంద్రబాబుకు సుప్రీం కోర్టు కండీషన్లు విధించింది. స్కిల్ స్కాంలో 53 రోజులు జైలులో ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు తొలుత మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య కారణాలతో బెయిల్ ఇచ్చిన హైకోర్టు పలు కండీషన్లను ఖరారు చేసింది. ఆ తరువాత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

 

Surpeme Court key directions for Chandra Babu in bail Cancel plea, posted for 11th December

హైకోర్టు వెలువరించిన తీర్పు మేరకు చంద్రబాబు రేపటి నుంచి స్వేచ్చగా రాజకీయ కార్యకలాపాల తో పాటుగా అన్నింటా పాల్గొనవచ్చు. ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, హైకోర్టు స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వటం సమంజసం కాదంటూ సీఐడీ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది. దీనిని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారించింది.

 

విచారణ వాయిదా సీఐడీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సీఐడీ తరపున వాదించిన ముఖుల్ రోహిత్గీ ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ అంశంతో పాటుగా కండీషన్ల నుంచి మినహాయింపు ఇవ్వటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో, సుప్రీం కోర్టు ఈ కేసును వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేసింది.

 

ఇదే సమయంలో గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు విధించిన కండీషన్లు కొనసాగుతాయని స్పష్టం చేసింది. స్కిల్ కేసు గురించి బయట చంద్రబాబు ప్రకటనలు చేయటానికి వీల్లేదని పేర్కొంది. అదే విధంగా కేసు వివరాల పైన బహిరంగంగా ప్రకటనలు చేయవద్దని స్పష్టం చేసింది.

 

చంద్రబాబుకు నోటీసులు స్కిల్ కేసులో 17 ఏపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇరు పక్షాలూ స్కిల్ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయరాదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం..రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి చంద్రబాబుకు అనుమతి ఇచ్చింది.

 

ఇక, సీఐడీ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటీషన్ లో చంద్రబాబుకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 11న ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. ఇక..ఇదే స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన విచారణ పూర్తయింది. తీర్పు వెల్లడి కావాల్సింది. చంద్రబాబు పైన కేసుల్లో మొత్తంగా ఈ తీర్పు కీలకం కానుంది.