AP

ఏపీ పై పవన్ ఫోకస్ .. ఆరోజు కీలక నిర్ణయాలు.

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో బిజెపితో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఎనిమిది సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేకుండా ఏపీపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టేందుకు పవన్ డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 1న జనసేన విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. పవన్ తో పాటు డీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సైతం హాజరు కానున్నారు.ఎన్నికల వ్యూహాలను రూపొందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ స్థితిగతులను చర్చించనున్నారు.

 

ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో సమన్వయ కమిటీల సమావేశాలు పూర్తయ్యాయి. ఇరు పార్టీల శ్రేణులు ఐక్యతగా ముందుకు వెళుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పొత్తు విచ్ఛిన్నానికి వైసిపి ప్రయత్నాలు చేస్తోంది. రెండు పార్టీల మధ్య చిన్నపాటి తగాదాలను సైతం భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తుంది. దీనికి చెక్ చెప్పే విధంగా పవన్ ప్రత్యేక వ్యూహం రూపొందించుకున్నట్లు సమాచారం. కేవలం వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకుండా శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జనసేన టిడిపి క్షేత్రస్థాయిలో సమన్వయంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాటర్ జాబితాల పరిశీలన తదితర విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

 

జనసేన ప్రతిపాదించే సీట్లు, పొత్తులో అడగాల్సిన స్థానాలపై సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉండగా.. అందులో జనసేనకు ఉన్న బలాబలాలు.. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలు.. అక్కడ పార్టీ శ్రేణుల ఆకాంక్షలు.. సీట్ల సర్దుబాటు… ఓట్ల బదలాయింపు.. పార్టీలో ధిక్కారస్వరాలపై తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సమావేశంపై జనసేన నాయకత్వం ప్రత్యేక అజెండా రూపొందించినట్లు సమాచారం. ఈ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.