AP

ఉరుసు ఉత్సవాల్లో వైఎస్ జగన్..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపలోని అమీన్‌ పీర్‌ దర్గాను సందర్శించారు. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వ‌హించారు. ఛాదర్‌ను సమర్పించారు. ఉరుసును పురస్కరించుకుని- కడప పెద్ద దర్గాగా రాయలసీమ వాసులకు చిరపరిచితమైన ఈ ఆధ్యాత్మిక స్థలం సందడిగా మారింది.

 

కర్నూలు ఓర్వకుల్లు నుంచి ప్రత్యేక విమానంలో జగన్ కడపకు బయలుదేరారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అమీన్‌పీర్‌ దర్గాకు చేరుకున్నారు. దర్గా పీఠాధిపతి ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కాషాయ తలపాగాను చుట్టారు. దర్గాలో ఛాదర్‌ సమర్పించిన అనంతరం జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఉన్నారు.

 

అంతకుముందు- వైఎస్ జగన్ నంద్యాల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లి వద్ద నిర్మించిన టన్నెల్ ఇది. గాలేరు- నగరిలో అంతర్భాగంగా దీన్ని ప్రభుత్వం నిర్మించింది.

 

మెట్టుపల్లికి చేరుకున్న తరువాత ముందుగా ఫొటో గ్యాలరీని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన టన్నెల నిర్మాణ స్థితిగతుల గురించి వివరించారు. అనంతరం వైఎస్ జగన్ టన్నెల్ 2 గుండా నీటిని విడుదల చేశారు. దీన్ని జాతికి అంకితం చేశారు. గాలేరు- నగరి వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని దీని గుండా తరలించాలనేది ప్రభుత్వ ఉద్దేశం

 

అవుకు తొలి టన్నెల్, రెండో టన్నెల్ పనులకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 340.53 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 2014- 19 మధ్యకాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు.. ఈ టన్నెల్ నిర్మాణానికి చేసిన వ్యయం దాదాపుగా నామమాత్రమే. 81.55 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేసింది. కీలకమైన ఫాల్ట్‌ జోన్‌లో పనులు చేయకుండా చేతులెత్తేసింది.

 

ప్రభుత్వం మారి.. అధికారం వైఎస్ జగన్‌ చేతికి వచ్చిన తరువాత మళ్లీ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 145.86 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది జగన్ ప్రభుత్వం. టన్నెల్‌ 2 నిర్మాణ పనులను దిగ్విజయంగా పూర్తి చేసింది. టన్నెల్‌ 3 నిర్మాణ పనుల కోసం ఇప్పటివరకు మరో 934 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. దీని నిర్మాణ కూడా తుదిదశకు వచ్చింది.

 

మూడో టన్నెల్ పొడవు 5.801 కిలో మీటర్లు. ఇందులో ఇప్పటికే 4.526 కిలో మీటర్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా 1,501.94 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది జగన్ సర్కార్. వీటి ద్వారా 30,000 క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగుతుంది.