నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. నీటివిడుదల నిలిపి వేయాలంటూ నిన్న క్రిష్ణానదీ యాజమార్య బోర్డు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఏపి ఈరోజు కూడా నీటి విడుదలను కొనసాగిస్తోంది… దీంతో ఇప్పటి వరకు సుమారు 8వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్ళి ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.
నిన్న సాయంత్రం రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు, డీజీపీలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా జరిపిన సమీక్షలో డ్యాం నిర్వహణను క్రిష్ణా నదీయాజమాన్య బోర్డుకు అప్పగించేందుకు అంగీకారం తెలిపాయి. దీంతో నిన్న రాత్రికే సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్ కు చేరుకున్నాయి.
మరోవైపు కేంద్ర జలశక్తిశాఖలో జలవనరుల విభాగం కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో పాటు సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్, కేఆర్ఎంబీ చైర్మన్ లతో వర్చువల్ గా సమావేశం జరుగుతోంది.. నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యతలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈసమావేశంలో తీసుకునే నిర్ణయాల మేరకు ఏపికి నీటివిడుదల నిలిపివేయనున్నట్లు డ్యాం అధికారులు చెప్తున్నారు.
ఇదిలా ఉంటే ఒకవైపు నీటి వినియోగంతో పాటు మరోవైపు తెలంగాణా పోలీసులపై ఏపీ ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి వారిపై కేసులు నమోదు చేయించారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య పోటా పోటీగా కేసులు నమోదు కావడం ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. తమపై దాడి చేసి నాగార్జునసాగర్ డ్యాం పైకి అక్రమంగా చొరబడ్డారని, తెలంగాణ సిబ్బంది చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అలాగే అనుమతి లేకుండా సాగర్ నీటిని విడుదల చేశారని ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు మరో కేసును కూడా నమోదు చేశారు. ఇక తాజాగా తెలంగాణ పోలీసులపై ఏపీ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయగా విజయపురి పోలీస్ స్టేషన్లో తెలంగాణ పోలీసులపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది.