AP

ఏపీపై తెలంగాణ ఎఫెక్ట్, ఓటరు మూడ్ క్లియర్ – ఆ పార్టీకి డేంజర్ బెల్స్..!!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు వీడ్కోలు పలికారు. ఇక..త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఫలితాల సరళి ఏపీకి ఏం సందేశం ఇస్తోంది. ఏపీ మూలాలు ఉన్న తెలంగాణ ఓటర్లు తమ మనసులో అభిప్రాయం ఓటుతో స్పష్టం చేసారు. ఈ ఫలితాలు ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు హెచ్చరికలా మారింది. వైసీపీ, టీడీపీ, జనసేన ఈ ఫలితాలు కలిసొస్తాయా.. నష్టం చేస్తాయా ఏం జరుగుతోంది.

 

కలిసొచ్చేదెవరికి:తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. పరోక్షంగా టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఓటమి గురించి సంతోషపడుతున్న టీడీపీ శ్రేణులు జగన్ కు నష్టం కలిగిందనే అభిప్రాయంతో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ గెలుపు ఏపీలో టీడీపీకి మేలు చేస్తుందనే భ్రమలో ఉన్నారు. కానీ, ఫలితాలు మాత్రం అసలు విషయం ఏంటనేది స్పష్టం చేస్తున్నాయి. టీడీప అక్కడ పోటీ చేయలేదు. టీడీపీ మద్దతు దారులు మాత్రం కాంగ్రెస్ కే అండగా నిలుస్తామని ప్రకటించారు. కొంత మంది టీడీపీ సన్నిహిత ప్రముఖలు హైదరాబాద్ లో ఏపీ మూలాలు ఉన్న సెటిలర్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేసారు. కానీ, గ్రేటర్ పరిధిలో..అందునా సీమాంధ్ర మూలాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, కుకట్ పల్లి, శేరిలింగం పల్లి, కుత్బుల్లాపూర్. మల్కాజ్ గిరిలో బీఆర్ఎస్ గెలిచింది. దీంతో, టీడీపీ ప్రచారం చేసుకున్నట్లుగా చంద్రబాబు అరెస్ట్.. టీడీపీ శ్రేణుల హంగామా ప్రచారానికే పరిమితమని తేలిపోయింది.

 

ఎవరికి నష్టం చేసేను:ఇక, వ్యూహంలో భాగంగానే తాను తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నానని పవన్ చెప్పారు. పవన్ పార్టీ పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో డిపాజిట్లు రాలేదు. పవన్ సభకు అభిమాన జనం పోటెత్తారు. కానీ, ఓట్లు పడలేదు. బీజేపీ కోసం పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు ఓటమి పాలయ్యారు. పవన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా..ఓట్లు పడేది లేదని తేలిపోయింది. ఇప్పుడు పవన్ కు రాజకీయం గా ఉన్న ఆదరణ ఏంటో బీజేపీకి స్పష్టమైంది. ఏపీ మూలాలు ఉన్న కుటుంబాలే ఆ నియోజకవర్గాల్లో అక్కడ బీఆర్ఎస్ కు జై కొట్టాయి. మరి..అవే కుటుంబాలు ఏపీలోనూ ఈ పార్టీలకు మద్దతుగా నిలుస్తాయా లేదా అనేది ఇప్పుడు లోలోపల రెండు పార్టీల నేతలకు టెన్షన్ పెంచుతున్నాయి. బీజేపీ ఆలోచనలోనూ మార్పు వచ్చే అవకాశం ఉంది. ఒంటరిగా బీజేపీ నేతలు ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఆ పార్టీ ఎనిమిది స్థానాలు దక్కించుకుంది. దీంతో, ఏపీలో ఏ వ్యూహంతో వెళ్లాలనేది బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

 

జగన్ కు లాభమా నష్టమా:ఇక, కేసీఆర్ ఓడటంతో జగన్ కు నష్టమనే ప్రచారం టీడీపీ మద్దతు దారుల్లో మొదలైంది. అక్కడ కేసీఆర్ పదేళ్ల పాలన పూర్తి చేసారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కేసీఆర్ చెప్పిన రైతు రుణ మాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేయలేదు. ఇవి గ్రామీణ ఓటర్ల పైన ప్రభావం చూపాయి. హైదరాబాద్ లో చేసిన డెవలప్ మెంట్..సీమాంధ్ర ఓటర్ల మద్దతు బీఆర్ఎస్ కు గ్రేటర్ పరిధిలో కలిసి వచ్చాయి. జగన్ ఇక్కడ ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ అక్కడ ఇచ్చిన గ్యారంటీ పథకాల కంటే అధికంగా సంక్షేమం అందిస్తున్నారు. ఇక..కేసీఆర్ చేయలేని ప్రజాబలం కోల్పోయిన ఎమ్మెల్యేల మార్పు విషయంలో జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. గెలిచే వారికి సీట్లని ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే, చంద్రబాబు అరెస్ట్ పైన ఏపీ కంటే హైదరాబాద్ లో ఎక్కువగా నిరసనలు జరిగాయి. అయితే సీమాంధ్ర ఓటర్లు ఉన్న నియోకజవర్గాల్లో టీడీపీ మద్దతు ఇచ్చిన పార్టీకి..పవన్ అభ్యర్దులకు ఓట్లు పడకపోవటం ఇప్పుడు ఈ రెండు పార్టీలకు డేంజర్ బెల్స్ గా మారుతున్నాయి.