AP

చంద్రబాబుకు మంత్రి గోవర్ధన్ రెడ్డి సవాల్..!!

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మూడు నెలల తరువాత చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ పైన చేసిన విమర్శలకు మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి స్పందించారు. చంద్రబాబు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు.

 

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. వ్యవసాయాన్ని కించపరిచేలా మాట్లాడిందే చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. 14 ఏళ్లలో వ్యవసాయానికి చంద్రబాబు తీసుకున్న చర్యలు ఏంటని ప్రశ్నించారు. రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. విపత్తుల సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని వివరించారు. విపత్తు కాలంలో రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలిచామని మంత్రి చెప్పుకొచ్చారు.

 

విపత్తుల సమయంలో రైతులకు చంద్రబాబు ఇచ్చిందేమిటని మంత్రి గోవర్ధన్ రెడ్డి నిలదీసారు. చంద్రబాబు మద్దతు మీడియా ప్రభుత్వంపైన అవాస్తవాలు ప్రచురిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో తుపాన్‌, వరదల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో స్పందించారని వివించారు. సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి తగిన ఏర్పాట్లు చేపట్టగలిగామని చెప్పారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. విద్యుత్ విషయంలో అపారమైన నష్టం జరిగినా యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చేపట్టామని మంత్రి వివరించారు.

 

గత రెండు రోజులుగా పర్యటనలు చేస్తున్న చంద్రబాబు… ఎక్కడా ప్రభుత్వం ఏవిధంగా విఫలమైందో స్పష్టంగా చెప్పలేక పోయారని వ్యాఖ్యానించారు. ఫొటోలకు ఫోజులు ఇవ్వడం చంద్రబాబు నైజమని మండిపడ్డారు. ప్రజలతో మమేకమయ్యే నాయకుడు ముఖ్యమంత్రి జగన్‌ అని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో విత్తనాలు కోసం క్యూ లైన్‌లో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు. ఎవరి హయాంలో రైతులకు మేలు జరిగిందో బహిరంగ చర్చకు తాను సిద్ధమని మంత్రి చెప్పారు. దమ్ముంటే చంద్రబాబు తనతో చర్చకు రావాలని సవాల్ చేసారు. తేదీ, టైమ్‌, ప్లేస్‌ చెబితే వస్తానని..తన సవాల్‌ను చంద్రబాబు స్వీకరించాలి అని మంత్రి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.