ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో నారాలోకేష్‌తో కలిసి ప్రశాంత్ కిషోర్ విజయవాడ చేరుకున్నారు.
తర్వాత.. ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీతో ప్రశాంత్ కిషోర్ టిడిపి కోసం పనిచేస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆయన పూర్తి స్థాయిలో టిడిపి కోసం పనిచేయడం లేదని.. మేనిఫెస్టో తయారీ, సోషల్ మీడియాలో ప్రచార బాధ్యతలు మాత్రమే తీసుకుంటారని చర్చ మొదలైంది.
ప్రస్తుతం టిడిపి పూర్తిస్థాయి వ్యూహకర్తగా రాబిన్ శర్మ గతకొంతకాలంగా ఉన్నారు. ఇక.. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలుపు తీరాలకు తీసుకెళ్లిన సునీల్ కనుగోలు సేవలు కూడా వినియోగించుకునే ప్లాన్ లో టీడీపీ ఉంది. మరి ఇంత మంది వ్యూహకర్తలతో టీడీపీ వ్యూహం ఏంటీ అనే ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికలలో వైసీపి కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ సంస్థ ఇప్పుడు టిడిపి గెలుపు బాధ్యతలు స్వీకరించడంతో.. జగన్మోహన్ రెడ్డి బృందంలో ఆందోళన మొదలైంది.