AP

సీనియర్లకు షాక్ ఇచ్చిన చంద్రబాబు.. వారికి టిక్కెట్లు లేనట్టే

వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకం. ఒక విధంగా చెప్పాలంటే చావోరేవో లాంటివి. అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపారు. జనసేన తో పొత్తు పెట్టుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఎన్నడూ లేని విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈసారి సీనియర్లకు షాక్ ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి టికెట్ అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎర్రం నాయుడు వారసులకు మినహాయింపు ఇచ్చారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడుఅచ్చెనాయుడు, రామ్మోహన్ నాయుడులకు మినహాయింపు లభించడం విశేషం.

 

More

From Ap politics

జనసేనకు సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అటు బిజెపి వస్తే పార్లమెంట్ స్థానాలను కేటాయించాల్సి ఉంది. దీంతో వీలైనంతవరకూ టిక్కెట్ల విషయంలో పొదుపు పాటించాలని చూస్తున్నారు. గతం మాదిరిగా ఇంట్లో ఒకరిద్దరికీ సర్దుబాటు చేయాలంటే కుదరని పనిగా తేల్చి చెబుతున్నారు. ముందుగానే సీనియర్లను పిలిపించుకుని పరిస్థితి అర్థమయ్యేలా వివరిస్తున్నారు. కుటుంబానికి ఒక్క టికెట్ అని.. ఎక్కడ కావాలో తేల్చుకోవాలని సూచిస్తున్నారు. గతంలో మాదిరిగా ఉదారంగా వ్యవహరించే పరిస్థితి లేదని.. అర్థం చేసుకొని నడుచుకోవాలని చంద్రబాబు సూచిస్తుండడం విశేషం.

 

రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఎక్కువగా రాజకీయ కుటుంబాలు టికెట్లు ఆశిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాల విషయంలోనూ చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు ఎంపీగా పోటీ చేశారు. ఆయన సతీమణి సుజాత ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగారు. ఇద్దరూ ఓడిపోయారు. సుజాత అదే అసెంబ్లీ స్థానానికి ఇన్చార్జిగా ఉన్నారు. ఈసారి కూడా రెండు స్థానాలు కావాలని కోట్ల కుటుంబీకులు కోరుతున్నారు. అయితే ఏదో ఒకచోట మాత్రమే టికెట్ ఇవ్వగలనని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కోట్ల కుటుంబం డోన్ నియోజకవర్గంలో బరిలో దిగితే మంచి ఫలితం ఉంటుందని టిడిపి నేతలు భావిస్తున్నారు. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం నుంచి ఆయన కుమారుడు శ్యాంబాబు పత్తికొండ ఇన్చార్జిగా ఉన్నారు. అదే కుటుంబం నుంచి కేఈ తమ్ముడు ప్రభాకర్ కూడా సీటు ఆశిస్తున్నారు. అయితే ఒక్క టిక్కెట్ ఇవ్వగలనని కేఈ కుటుంబానికి చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. కృష్ణమూర్తి మాత్రం కుమారుడు శ్యామ్ వైపు మొగ్గు చూపారని ప్రచారం జరుగుతోంది.

 

అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి సైతం ఒకే టికెట్ ఇవ్వనున్నట్లు చంద్రబాబు తేల్చినట్లు సమాచారం. పరిటాల సునీత రాప్తాడు ఇన్చార్జిగా, ఆమె కుమారుడు శ్రీరామ్ ధర్మవరం ఇన్చార్జిగా ఉన్నారు. ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇస్తానని చంద్రబాబు తేల్చగా.. ఏదో ఒక నిర్ణయం తీసుకొని చెబుతామని పరిటాల కుటుంబం బదులిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబం నుంచి ఇద్దరు నేతలు ఉన్నారు. ఎర్రన్న సోదరుడు అచ్చన్న ఎమ్మెల్యే గాను, కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీ గాను ఉన్నారు. గత ఎన్నికల్లో అంతటి ప్రభంజనంలో సైతం ఇద్దరూ గెలుపొందారు. అందుకే అక్కడ రాజకీయ సమీకరణలను అనుసరించి వారికి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే ఎటువంటి మొహమాటలకు పోకుండా ముందుగానే చంద్రబాబు సీనియర్లకు తేల్చి చెప్పడం విశేషం.