AP

వైసీపీ నేతలకు చంద్రబాబు ట్రాప్ – మారుతున్న లెక్కలు..!!..

ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లా నేతల పైన తాజాగా చంద్రబాబు వ్యూహాత్మక వ్యాఖ్యలు చేసారు. సీట్ల దక్కని వారితో టీడీపీ ముఖ్యులు టచ్ లోకి వెళ్లారనే ప్రచారం వేళ చంద్రబాబు వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. దీంతో, కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.

 

వైసీపీలో సీట్ల మార్పు:ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వైసీపీ సీట్ల మార్పు వేళ కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ సీట్లు రాని నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సీటు లేదనే ప్రచారం సాగుతోంది. మాగుంట పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని ఇప్పటికే ఖండించారు. బాలినేనికి ఒంగోలు సీటు ఖాయమని చెబుతున్నా..ఇంకా అధికారికంగా ఖరారు కాలేదనే చర్చ వినిపిస్తోంది. పరిస్థితుల్లో ఒంగోలు లోక్‌సభ స్థానానికి దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్‌ పేరును వైసీపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు అసెంబ్లీకి శిద్దా కుమారుడిని పోటీచేయించాలని మాజీమంత్రి శిద్దా రాఘవరావుకు జగన్‌ సూచించినట్లు చెబుతున్నారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి సీటు వ్యవహారం పైన స్పష్టత రావాల్సి ఉంది.

 

 

సీఎం జగన్ మంత్రాంగం:తాజాగా బాలినేని-మాగుంట ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల సీట్లు, భవిష్యత కార్యాచరణ పైన చర్చలు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబులతో జగన్‌ విడివిడిగా మాట్లాడారు. దర్శి టికెట్‌ ఇవ్వనని వేణుగోపాల్‌కు చెబుతూనే.. ఒంగోలు లోక్‌సభ, ఒంగోలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ప్రస్తావించినట్లు తెలిసింది.

 

తనతో చెప్పకుండా ఎన్నికల్లో పోటీచేయనని ఎందుకు ప్రకటన చేశారని ఎమ్మెల్యే రాంబాబును సీఎం జగన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీతో పాటుగా పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పుల పైన ఇప్పటికే తొలి విడత కసరత్తు పూర్తయింది. అక్కడ సిట్టింగ్ ల్లో మార్పులు చేసే వారికి ప్రత్యామ్నాయాలు సూచించటంతో పాటుగా వారి ఆలోచనలు చెప్పాలని కోరారు.

 

చంద్రబాబు వ్యాఖ్యలతో:ఇదే సమయంలో కనిగిరి సభలో చంద్రబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తనను, పవన్‌ ను తిడితే టికెట్‌ ఇస్తానంటూ జగన్‌ చేసిన ప్రతిపాదన చేసారనే జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు దానిని తిరస్కరించడం వారి సంస్కారానికి నిదర్శనం. అందుకు వారిని అభినందిస్తున్నా, మీరూ వారిని అభినందించాలంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

 

ఎమ్మెల్యే అన్నా రాంబాబును పోటీ చేయకుండా వెళ్లేవరకు తీసుకొచ్చారని.. బాలినేనిని అడ్రస్‌లేకుండా చేశారని వ్యాఖ్యానించారు. మాగుంట, మహీధరరెడ్డికి కితాబిస్తూ బాలినేని, రాంబాబుపైన చంద్రబాబు ఎలాంటి విమర్శలు చేయకపోవటంతో..ఇప్పుడు ప్రకాశం రాజకీయాలు ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.