ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల వైసీపీ ఇంచార్జ్ ల మార్పు పలువురు నేతలు టీడీపీ, జనసేన బాట పట్టటానికి కారణం అయ్యింది. ఏపీలో సీఎం జగన్ నిర్ణయంతో వైసీపీ నుండి ప్రత్యర్థి పార్టీలకు వలసలు పెరుగుతున్న క్రమంలో వైసీపీ గీత దాటుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలకు సిద్ధమైంది.
పార్టీ విధానాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ పార్టీ లైన్ దాటిన వారిపై వైసీపీ అధినాయకత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. పార్టీ లైన్ దాటిన ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలపై చర్యలకు ఉపక్రమించిన వైసీపీ అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసింది. వీరిలో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు ఉన్నారు.
ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు వైసీపీ ఫిర్యాదు చేసింది. వారంతా పార్టీ లైన్ దాటి పనిచేశారంటూ స్పీకర్ తమ్మినేనికి ఫిర్యాదు చేసింది. అంతేకాదు అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి. రామచంద్రయ్యలను కూడా వైసీపీ టార్గెట్ చేసింది.
వంశీ కృష్ణ యాదవ్, సి. రామ చంద్రయ్యలపై కూడా అనర్హత వేటు వేయాలని కూడా మండలి ఛైర్మన్ మోషెన్ రాజు కు వైసీపీ ఫిర్యాదు చేసింది.వంశీకృష్ణ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి జనసేన పార్టీలో చేరిన క్రమంలో ఆయనపై చర్య తీసుకోవాలని కోరింది. సి. రామచంద్రయ్య టీడీపీలో చేరడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తూ చర్యలకు సిద్ధమయింది.
అయితే వీరిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ చేసిన ఫిర్యాదుపై స్పీకర్, మండలి ఛైర్మన్ ఏం చెయ్యనున్నారు? వీరిపై ఎప్పుడు చర్యలు తీసుకోనున్నారు? ఒకవేళ చర్యలు తీసుకుంటే వారి ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. పార్టీ గీత దాటి ప్రవర్తించే వారికి హెచ్చరికగా ఉండటం కోసమే వైసీపీ ఈ సీరియస్ నిర్ణయం తీసుకుంది.