టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనాలోచిత నిర్ణయాలు.. ముక్కుసూటితనంతో క్రికెట్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అంబటి రాయుడు.. రాజకీయాల్లోనూ అదే తరహా శైలితో దూకుడు కనబరుస్తున్నారు.
ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరిన రాయుడు.. 10 రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను ఆశించిన సీటు దక్కలేదని, దాంతోనే పార్టీ నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరగ్గా.. రాయుడు మాత్రం రాజకీయాల నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
దుబాయ్ వేదికగా జరిగే ఐఎల్ టీ20లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నానని, ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కొనసాగుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని, దాంతో వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన ఇచ్చిన 24 గంటల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో అంబటి రాయుడు భేటి అయ్యారు.
పవన్ కళ్యాణ్ సమావేశానికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేసిన రాయుడు.. ఆ పార్టీలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతానికి పార్టీలో చేరకున్నా.. ఐఎల్ టీ20 ముగిసిన అనంతరం జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సన్నిహితులు, శ్రేయోభిలాషుల సూచనలతోనే పవన్ కళ్యాణ్‌ను కలిసానని అంబటి రాయుడు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ సిద్దాంతాలు తన ఆలోచనలకు విరుద్దంగా ఉన్నాయని, అందుకే ఆ పార్టీని వీడానని రాయుడు వివరణ ఇచ్చారు. ‘స్వచ్చమైన మనస్సు, సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరాను. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం ఈ పార్టీతోనే నెరవేరుతుందని నేను భావించాను.
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయిలో ఎన్నో గ్రామాలు తిరిగాను. ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నాను. వాటిలో కొన్నింటిని సొంతంగా తీర్చాను. ఎంతో సోషల్ వర్క్ చేశాను. కొన్ని కారణాల వల్ల వైఎస్సార్‌సీపీతో నా లక్ష్యం నెరవేరదనే అభిప్రాయం నాకు కలిగింది. ఎవర్నీ నిందించడం లేదు.
నా ఆలోచనలు.. వైఎస్సార్‌సీపీ సిద్దాంతాలు విరుద్దంగా ఉన్నాయి. ఎక్స్, వై సీట్ ఇవ్వలేదని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. రాజకీయాలకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కానీ నా శ్రేయోభిలాషులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఒకసారి పవన్ కళ్యాణ్‌తో మాట్లాడాలని సూచించారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకునే ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ ఐడియాలజీ అర్థం చేసుకోవాలని చెప్పారు.
వారి సూచనల మేరకే పవన్ అన్నను కలిసి చర్చించాను. చాలా సేపు ఆయనతో గడిపాను. జీవితం, రాజకీయాల గురించి అనేక విషయాలు మాట్లాడుకున్నాం. ఆయనను ఎంతో అర్థం చేసుకున్నాను. ఆయన ఐడియాలజీ, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయని చెప్పేందుకు నేను సంతోషిస్తున్నాను.
పవన్ కళ్యాణ్‌ను కలిసినందుకు నేను ఎంతో సంతోషంగా ఫీలవుతున్నాను. క్రికెట్ కోసం ప్రస్తుతం నేను దుబాయ్ వెళ్తున్నాను. నేనెప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల క్షేమం కోసం నిలబడుతాను.’అని రాయుడు తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.