ఏపీలో గత రెండు నెలలుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లపై ఇప్పటికే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దీనికీ వారు లొంగకపోవడంతో ఇవాళ్టి నుంచి సమ్మెల ఉన్న అంగన్ వాడీలను విధుల నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్లు తమ జిల్లాల్లో సమ్మెలో ఉన్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లను తొలగించే ప్రక్రియ చేపట్టారు.
సమ్మెలో ఉన్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లను భారీ ఎత్తున తొలగించేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు వారి స్ధానాల్లో కొత్త వారి నియామకం కోసం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కొత్త వారిని ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 25న అంగన్ వాడీల్లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయబోతోంది. ఇందుకోసం జిల్లాల్లో ఖాళీ అయిన అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఖ్యను గుర్తించబోతున్నారు.
జిల్లా కలెక్టర్ల నుంచి వివరాలు రాగానే అంగన్ వాడీ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు సచివాలయాల ద్వారా దరఖాస్తులు కూడా స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే అంగన్ వాడీ ఖాళీల భర్తీ కోసం ఈ నెల 25న నోటిఫికేషన్ రావడం, 26 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెలాఖరు కల్లా కొత్త వారిని అంగన్ వాడీ ఉద్యోగాల్లో తీసుకునే అవకాశం ఉంది.