ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ల కోసం అన్ని పార్టీలలోనూ ఆశావహుల సమరం కొనసాగుతుంది. ఇప్పటికే వైసీపీలో టిక్కెట్లు దక్కవని భావిస్తున్న వారు టీడీపీ, జనసేన పార్టీలలో చేరుతున్నారు. దీంతో ఏపీలో వలసల పర్వం కొనసాగుతుంది.
ఇదిలా ఉంటే ఇక టీడీపీలోనూ టీడీపీ, జనసేన పొత్తుల నేపధ్యంలో చిచ్చు రగులుకుంది. జనసేన ఆశిస్తున్న స్థానాలలో టీడీపీ నుండి ఆశావహులు టికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో తెలుగుతమ్ముళ్ళు కూడా రంగంలోకి దిగుతున్నారు. బలప్రదర్శలతో ఒకరు, బెదిరింపులతో మరొకరు రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు.
బీకామ్ లో ఫిజిక్స్ కామెంట్ తో అప్పట్లో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమ నుండి టికెట్ ఆశిస్తున్నారు, 2019ఎన్నికల్లో ఆయన తన కుమార్తె షబానాకు టికెట్ ఇప్పించి కుమార్తె గెలుపు కోసం కృషి చేశారు. అయినా వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో షబానా ఓటమి పాలైంది, అయితే ఈ సారి తానే పోటీ చెయ్యాలని భావిస్తున్నారు.
కానీ టీడీపీ జనసేన పొత్తులలో భాగంగా ఆ స్థానం జనసేనకు దక్కే అవకాశం ఉండటంతో తాజాగా జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఈసారి టికెట్ ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరేసుకుంటారని ఆయన సంచలనవాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నుండి బరిలోకి దిగేది తానేనని, గెలిచేది కూడా తానేనని పేర్కొన్న జలీల్ ఖాన్ టికెట్ ఎవరైనా అడగొచ్చు కానీ గెలిచే దమ్ము ఉండాలి, అది నాకు ఉందని పేర్కొన్నారు.
సర్వే రిపోర్ట్ లో ఎవరికి విజయావకాశాలు ఉంటే వారికే టికెట్ ఇస్తారు. విజయవాడ పశ్చిమ టీడీపీది. అక్కడ కచ్చితంగా టీడీపీ వాళ్ళకే టికెట్ ఇవ్వాలి. వేరే వాళ్ళు అడగటంలో తప్పు లేదు కానీ గెలవాలి కదా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు విజయవాడ పశ్చిమ టికెట్ తనకు ఇవ్వకుంటే ముస్లిం మైనార్టీలు ఉరేసుకుంటారని, ఇప్పటికే నేను వాళ్ళను ఆపానని లేదంటే ఇద్దరు ముగ్గురు ఉరేసుకునే వాళ్ళని జలీల్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు.