TELANGANA

తెలుగు రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్టులు, కేటాయింపులు..!

కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇందులో ప్రస్తావించిన అంశాలు, కేటాయింపుల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల సమయం లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలోనే రైల్వే బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు చేసిన కేటాయింపుల పైన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. గతం కంటే అంచనాలు పెరిగినట్లు వెల్లడించారు.

 

ఎన్నికల ఏడాది కావటంతో నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇదే బడ్జెట్ లో రైల్వే కేటాయింపులను ప్రతిపాదించారు. తెలుగు రాష్ట్రాల్లో రైల్వేకు సంబంధించిన కేటాయింపు ల గురించి మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరాలు చెప్పుకొచ్చారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ.5,071 కోట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 100శాతం విద్యుదీకరణ పూర్తయిందని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ అన్నారు. రాష్ట్రంలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి పీఎం శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

 

విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఇంకా భూమి అప్పగించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తిచేసి కేంద్రానికి అప్పగిస్తే పనులు ప్రారంభిస్తామన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు కోసం డీఎపీఆర్‌ సైతం సిద్ధమైందన్నారు.ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9138 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. 2009 నుంచి 2014 వరకు రూ.886 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి నిధులు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఏడాదికి 240 కి.మీ ట్రాక్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఏపీలో 98 శాతం విద్యుద్దీకరణ పూర్తి అయినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.