AP

ఢిల్లీ కేంద్రంగా నేడు వైయస్ షర్మిలా దీక్ష..!

వైఎస్ షర్మిల ఏ పని చేసినా ఆచి తూచి అడుగేస్తారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఏపీలో ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చి, వచ్చే ఎన్నికల్లో బలంగా బరిలో నిలిచేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో జనం నాడిని పట్టుకోవటానికి ఆమె ప్రయత్నాలు సాగిస్తున్నారు.

 

ఏపీ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాన్ని గట్టిగా పట్టుకున్న వైఎస్ షర్మిల అటు కేంద్రంలోని బీజేపీపై, ఇటు రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలను టార్గెట్ చేస్తూ ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నారు. ఏపీలో మరుగున పడిపోయిన ప్రత్యెక హోదా అంశాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకువచ్చి ప్రజలకు ప్రత్యేక హోదాపై కొత్త ఆశలు కలిగిస్తున్నారు వైఎస్ షర్మిల.

 

ఏపీలో షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ నిత్యం వార్తలలో ఉంటుంది. ఆ విధంగా షర్మిల దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా రాజకీయంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను వదిలిపెట్టని వైఎస్ షర్మిల ఈసారి తన రాజకీయాన్ని ఢిల్లీకి మార్చారు. ఢిల్లీ కేంద్రంగా నేడు వైఎస్ షర్మిల దీక్ష చేయనున్నారు.

 

ఇప్పటికే ప్రత్యేక హోదా అంశాన్ని ఏపీలో జనాల్లోకి జోరుగా తీసుకువెళ్తున్న షర్మిల ఇప్పుడు హస్తిన వేదికగా ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయనున్నారు. ఏపీకి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదాతో పాటు, విభజన చట్టంలోని హామీల అమలు కోసం వైఎస్ షర్మిల దీక్ష చేయనున్నారు.

 

ఏపీ ప్రజల ప్రత్యెక హోదా ఆకాంక్షను ఢిల్లీ వేదికగా జాతీయ నాయకులకు చెప్పాలని సంకల్పిస్తున్న షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెచ్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే తమకు సపోర్ట్ చేసే సీపీఐ, సీపీఎం తో పాటు ఇతరత్రా పార్టీల నేతలను కలిసి మద్దతు కోరిన షర్మిల నేడు దీక్షతో వ్యూహాత్మక అడుగు వేస్తున్నారు