TELANGANA

తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు: ఎండలు కూడా తీవ్రమే, వడగాలుల అలర్ట్

హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆవర్తనం ఇవాళ దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో స్థిరంగా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇవాళ ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియన్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు తెలిపింది.

రాగల మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు, వచ్చే ఐదు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు.

రానున్న నాలుగు రోజులపాటు ఎండలు తీవ్రమే : హైదరాబాద్‌లో రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ.. జూన్ 9, 2023 వరకు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 41-44 డిగ్రీల సెల్సియస్‌లో ఉంటుందని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. తెలంగాణలో వేడిగాలులు వీచే జిల్లా ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు. రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక ఇతర జిల్లాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాల్లోనూ తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉండటంతో బయట తిరిగే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.