ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక తర్వాత వైసీపీ నేతల్ని వరుసగా టార్గెట్ చేస్తుండటంతో అధికార పార్టీ కూడా అంతే దీటుగా బదులిస్తోంది. ఇందులో ముఖ్యంగా మంత్రి ఆర్కే రోజాకూ, వైఎస్ షర్మిలకూ మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఇవాళ మరోసారి వైఎస్ షర్మిలపై మంత్రి రోజా రెచ్చిపోయారు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికపై మంత్రి ఆర్కే రోజా ఇవాళ మరోసారి మండిపడ్డారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో అందరూ గమనించాలని రోజా కోరారు. జగన్ ను జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలపడం ఏంటని రోజా ప్రశ్నించారు. తద్వారా ఏపీకి అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ జగన్ సర్కార్ పై షర్మిల చేస్తున్న విమర్శల్ని రోజా తప్పుబట్టారు.
తెలంగాణలో పోరాటం చేస్తానంటూ పెట్టిన వైఎస్సార్టీపీని ఎందుకు కాంగ్రెస్ లో విలీనం చేశారో వైఎస్ షర్మిల చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. ఏపీలో ఏ లబ్ది పొందడానికి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారో ఆమె చెప్పాలన్నారు. తండ్రి వైఎస్సార్ బతికుంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద ఉమ్మేసే వాళ్లన్నారు. అటువంటి పార్టీలోకి ఏ మొహం పెట్టుకుని చేరారో షర్మిల సమాధానం చెప్పాలని మంత్రి ఆర్కే రోజా కోరారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడి నుంచి ఏపీకి రావాల్సిన 6 వేల కోట్లు ఇప్పించాలని వైఎస్ షర్మిలను రోజా డిమాండ్ చేశారు. అలాగే ఉమ్మడి ఏపీ నుంచి రావాల్సిన లక్షా 80 వేల కోట్ల ఆస్తులు కూడా రాబట్టాలని కోరారు