AP

జగన్ ఆపరేషన్ అపోజీషన్ వయా ఢిల్లీ..

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ ఇప్పటికే ఎన్నికల సమరశంఖం పూరించారు. అభ్యర్దుల ఖరారు తుది దశకు చేరింది. టీడీపీ, జనసేన రెండు పార్టీలు జగన్ ఓటమి లక్ష్యంగా ఒక్కటయ్యాయి. బీజపీ ఈ రెండు పార్టీలతో కలిసి రావటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే జగన్ అలర్ట్ అయ్యారు. ఢిల్లీ కేంద్రంగా రాజకీయం మొదలు పెట్టారు. ప్రస్తుత పరిణామాలు అన్నీ జగన్ కోరుకున్న విధంగానే జరుగుతున్నాయి. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది.

 

మారుతున్న లెక్కలు : ఏపీలో కొత్త రాజకీయం తెర మీదకు వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా ఏపీలో పొత్తుల చర్చలు మొదలయ్యాయి. 2014 రాజకీయ పొత్తులు ఖాయంగా కనిపిస్తున్నాయి. కానీ, దీని వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో పొత్తుల పైన చర్చలు చేసారు. ఎన్డీఏలో చేరేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపారు. అంతే, మరుసటి రోజు సీఎం జగన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ప్రధాని మోదీతో జగన్ సదీర్ఘ భేటీ నిర్వహించారు. ఇటు చంద్రబాబును పొత్తుకు ఆహ్వానించి..అటు జగన్ తో మంతనాలతో టీడీపీ క్యాంపులో ఆయోమయం నెలకొంది. బీజేపీతో ఓట్ల పరంగా టీడీపీకి ప్రయోజనం లేకపోయినా..జగన్ పైన ఎలక్షన్ చేయాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమనేది చంద్రబాబు ఆలోచన.

 

ఢిల్లీ రాజకీయం : ఇక్కడే చంద్రబాబు బలహీనతలను బీజేపీ గుర్తించింది. అటు జగన్ వేగంగా కదిలారు. ప్రధానితో జగన్ సుదీర్ఘ భేటీతో చంద్రబాబు క్యాంపులో సందేహాలు పెరిగాయి. తమ పొత్తు ద్వారా బీజేపీ ఇక వైసీపీని దూరం పెడుతుందని భావించారు. కానీ, ఇటు తమతో పొత్తు..అటు జగన్ తో స్నేహం అన్నట్లుగా బీజేపీ తీరు టీడీపీ క్యాంపు అంతు చిక్కటం లేదు. అదే సమయంలో బీజేపీతో దూరంగా ఉంటే నష్టం తప్పదనే ఆందోళన వెంటాడుతోంది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల లెక్కలు కీలకంగా మారుతున్నాయి. సీట్ల ఖరారులో బీజేపీ పట్టు బిగిస్తోంది. ఖచ్చితంగా తమ రెండు పార్టీలకు 50 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీకి కోరిన విధంగా సీట్లు ఇస్తే సొంత పార్టీ నుంచి సమస్యలు వస్తాయి. ఇవ్వకపోతే బీజేపీతో పొత్తు సందేహంగా కనిపిస్తోంది. బీజేపీ నేతలు పొత్తు ప్రకటన పైన చేస్తన్న ఆలస్యం పైన టీడీపీలో అనుమానాలు పెరుగుతున్నాయి.

 

 

ఏపీ సమీకరణాలు : పొత్తులో భాగంగా టీడీపీతో బీజేపీ కలిసినా..మూడో సారి అధికారంలోకి వచ్చినా బీజేపీకి లోక్ సభ లో ఎవరి మద్దతు అవసరం రాకపోవచ్చు. రాజ్యసభలో మద్దతు అవసరం. రాజ్యసభలో వైసీపీ సీట్ల సంఖ్య 11కు చేరుతుంది. టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోవటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నాన్చుడు ధోరణితో సీట్ల వ్యవహారం పైన సమయం గడిచిపోతోంది. అటు వైసీపీ అభ్యర్దులు ప్రచారం ప్రారంభించారు. ఇక్కడ మూడు పార్టీల మధ్య క్షేత్ర స్థాయిలో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది. అది అసలు సమస్య కాబోతోంది. జగన్ పథకాలు ఇప్పటికే ప్రజల్లో అమలవుతున్నాయి. ఈ సారి సంక్షేమమే ప్రధాన ఎన్నికల అజెండాగా మారబోతోంది.టీడీపీ ప్రకటించిన సంక్షేమానికి ప్రచారం అవసరం. కానీ, సమయం తక్కువగా ఉంది.

 

కలిసొచ్చేదెవరికి : బీజేపీతో పొత్తు కారణంగా ఆ పార్టీని వ్యతిరేకించే కొన్ని వర్గాలు జగన్ కు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. జగన్ ఎన్నికల వరాలు ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. అన్ని రకాలుగా చంద్రబాబు , పవన్ డైలమాలో ఉన్నారు. వీరిద్దరి నిర్ణయాల కోసం కేడర్ వేచి చూస్తోంది. రానున్న రోజుల్లోనూ ఈ రెండు పార్టీలను మరింత ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలతోనే జగన్ ముందుకు వెళ్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది.