AP

ఎంపీగా నాగబాబు – విశాఖ అభ్యర్దులను ఖరారు చేసిన పవన్..

జనసేనాని పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనసేన పోటీ చేసే స్థానాల పైన స్పష్టత ఇస్తున్నారు. పవన్ మరోసారి భీమవరం నుంచి పవన్ పోటీ చేయటం ఖాయమైంది. మెగా బ్రదర్ నాగబాబు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయటం ఖరారైంది. విశాఖ పరిధిలో జనసేన నాలుగు స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఇంఛార్జ్ లను నియమించారు. పొత్తులు ఖాయమైన తరువాత వీరిని పార్టీ అభ్యర్దులుగా ప్రకటించనున్నారు. ఇదే సమయంలో పార్టీకి పవన్ రూ 10 కోట్ల విరాళం ప్రకటించారు.

 

ఇంఛార్జ్ ల నియామకం ఏపీలో ఎన్నికల వేళ పవన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనలో భాగంగా పార్టీ పోటీ చేసే అభ్యర్దులను ఖరారు చేసారు. గోదవరి జిల్లాలతో పాటుగా విశాఖలో పవన్ కల్యాణ్ ఎక్కువ స్థానాలు కోరుతున్నారు. పవన్ 2019లో ఓడిన భీమవరం నుంచే తిరిగి పోటీకి నిర్ణయించారు. నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీకి సిద్దమవుతున్నారు. జనసేనకు మూడు ఎంపీ స్థానాలు ఖరారయ్యాయి. ఎమ్మెల్యే స్థానాల పైన బీజేపీతో పొత్తు ఖరారైన తరువాత స్పష్టత రానుంది. అప్పటి లోగా పార్టీ కోరుకున్న స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి వీలుగా పవన్ ఇంఛార్జ్ లను ప్రకటించారు. 2009లో అల్లు అరవింద్ ఇదే అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు నాగబాబు అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయటం ఖాయమైంది.

 

విశాఖలో నాలుగు సీట్లు ఇక, విశాఖ పరిధిలోని భీమిలి నుంచి వైసీపీ నుంచి జనసేన లో చేరిన వంశీ క్రిష్ణ యాదవ్ ను పవన్ ఇంఛార్జ్ గా ప్రకటించారు. పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్, గాజువాక నుంచి సుందరపు సతీష్, యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్ పేర్లు దాదాపు ఖాయమయ్యాయి. వీరిని ఎన్నికల్లో పోటీకి వీలుగా పని చేసుకోవాలని పవన్ సూచించినట్లు తెలుస్తోంది. పవన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ పొత్తుల పైన స్పష్టత వచ్చిన తరువాత అధికారికంగా అభ్యర్దులను ప్రకటిస్తానని పవన్ వెల్లడించారు. పొత్తుల్లో భాగంగా సీట్లు దక్కని వారికి సముచిత గౌరవం దక్కేలా బాధ్యత తాను తీసుకుంటానని పార్టీ నేతలకు పవన్ హామీ ఇచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా.. రాష్ట్ర భవిష్యత్ కోసమే తన నిర్ణయాలు ఉంటాయని పవన్ చెప్పుకొచ్చారు. కూటమి అధికారంలోకి వస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేసారు.

 

రూ 10 కోట్ల విరాళం జనసేన కోసం పని చేసిన ఎవరినీ విస్మరించనని పవన్ స్పష్టం చేసారు. ఎమ్మెల్యే సీట్ల కోసమే కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. సమిష్టిగా నిలిచే విధంగా అడుగులు వేస్తానని పవన్ చెప్పుకొచ్చారు. పార్టీ బలోపేతం, పార్టీ పక్షాన ఎన్నికల నిర్వహణ కోసం రూ 10 కోట్లు ఇవ్వనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఒకటి రెండు రోజుల్లోనే ఢిల్లీ వెళ్లనున్నారు. పొత్తులు, సీట్ల గురించి బీజేపీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు. పొత్తుల పైన స్పష్టత వచ్చిన తరువాత ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని పార్టీ నేతలకు పవన్ స్పష్టం చేసారు. కూటమిని గెలుపు దిశగా తీసుకెళ్లేందుకు ప్రతీ ఒక్కరూ పని చేయాలని పవన్ పిలుపునిచ్చారు.