AP

7 లక్షలమందితో టీడీపీ- జనసేన ఉమ్మడి సభ..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన సంయుక్తంగా ఎన్నికల సమర శంఖాన్ని పూరించాయి. ఎన్నికల రణభేరిని మోగించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

 

పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల ప్రతిపాడు వద్ద ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేశాయి టీడీపీ-జనసేన. దీనికి తెలుగు జన విజయ కేతనం జెండాగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సభకు లక్షలాది మంది తరలివచ్చారు. 21 ఎకరాల్లో ఈ సభను ఏర్పాటు చేయగా.. స్థలం చాలలేదు. కిటకిటలాడింది.

 

సాయంత్రం 5:30 గంటలకు చంద్రబాబు- పవన్ కల్యాణ్ సభావేదిక మీదికి రావాల్సి ఉండగా.. మధ్యాహ్నం నుంచే ప్రజలు సభా ప్రాంగణం వైపు తరలివచ్చారు. ఎర్రటి ఎండను సైతం వారు లెక్క చేయలేదు. అన్ని దారులూ తాడేపల్లిగూడెం వైపే అన్నట్లుగా సాగింది.. జన ప్రస్థానం.

 

ఏడు లక్షలమంది వరకు ప్రజలు ఈ సభకు హాజరైనట్లు పార్టీ వర్గాలు అంచనా వేశాయి. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వారికి ఏ మాత్రం తీసిపోని విధంగా జన సైనికులు ఈ సభకు హాజరయ్యారు. టీడీపీ-జనసేన ఉమ్మడి కూటమిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద భారీ బహిరంగ సభగా అభివర్ణిస్తోన్నారు రాజకీయ పండితులు.

 

ఇటీవలే తెలుగుదేశం, జనసేన పార్టీలు 118 మంది అభ్యర్థులతో కూడిన తొలి ఉమ్మడి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. దీని తరువాత నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకొంది. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు వేదికను పంచుకున్నారు.

 

తాడేపల్లిగూడెంలో జరుగుతున్న ఈ భారీ బహిరంగ ద్వారా జగన్ ప్రభుత్వానికి ఇరు పార్టీల అధినేతలు కీలక సందేశాన్ని పంపించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలనే లక్ష్యంతో ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటున్నారని ఇరుపార్టీల నేతలు చెప్పుకొచ్చారు.

 

ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ ముఖ్య అజెండాగా, రాష్ట్రం బాగుండాలి అనే ఏకైక సంకల్పంతో ఈ సభను ఏర్పాటు చేశామని, దీనికి అనుగుణంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేసిన విధ్వంసకర పాలకులపై తెలుగు ప్రజలు ఎగరేసిన తిరుగుబాటు బావుటా ఈ జెండా సభగా అభివర్ణించారు.