అసెంబ్లీ ఎన్నికల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఏడు జాబితాలను ప్రకటించిన వైసీపీ.. తాజాగా మరో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన 8వ జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది.
పార్లమెంట్ నియోజకవర్గాల్లో గుంటూరుకు కిలారు రోశయ్య, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇంఛార్జీలుగా ప్రకటించింది. అసెంబ్లీ స్థానాల్లో పొన్నూరుకు అంబటి మురళి, కందుకూరుకు మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరుకు కృపాలక్ష్మిని సమన్వయకర్తలుగా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
అయితే తాజాగా విడుదల చేసిన జాబితాలో కొందరు అభ్యర్థులను మారుస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. కిలారి రోశయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళిని నియమించింది. ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి సోదరుడు అంబటి మురళికి పొన్నూరు నుంచి అవకాశం కల్పించింది. గతంలో ఎంపీ అభ్యర్థిగా అనుకున్న ఉమ్మారెడ్డి వెంకట రమణ స్థానంలో కిలారి రోశయ్యకు అవకాశం కల్పించింది. ఇక, కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ పేరును ఖరారు చేసింది.
మరోవైపు, జీడి నెల్లూరు వైసీపీ అభ్యర్థిని మళ్లీ మార్చారు. జీడి నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంటుకు పంపిస్తూ కీలక మార్పులు చేశారు. చిత్తూరు పార్లమెంటు నుంచి పోటీకి విముఖత చూపడంతో తిరిగి జీడీ నెల్లూరు అసెంబ్లీ స్థానాన్ని ఖరారు చేసింది. నారాయణస్వామి కాకుండా ఆయన కుమార్తెకు టికెట్ కేటాయించిన వైసీపీ అధిష్టానం. ఇప్పుడు, కొత్త అభ్యర్థిగా కళత్తూరు కృపాలక్ష్మిని నియమించారు.