AP

జనసేనలో చేరిన బాలశౌరి..కూలీనంటూ పవన్ కళ్యాణ్, దమ్మున్న నేతన్న ఎంపీ…

తాను ‘పవర్ స్టార్‌’గా కంటే ప్రజల కోసం పనిచేసే కూలీగా గుర్తిస్తే గవర్వపడతానని అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. బాలశౌరికి జనసేన పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్. ఎంపీటోపాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. తనని తాను అర్జునుడితో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అర్జునుడు తన ఆడపడుచుల్ని రక్షించాడు కానీ.. ఎప్పుడూ తూలనాడలేదన్నారు. సొంత చెల్లి గురించి కానీ, జగన్ మాత్రం సొంత చెల్లి గౌరవం ఇవ్వలేదన్నారు. ఎవరు మంచి వారో.. ఎవరు దోపిడీదారులో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.

 

తనకు పదవులపై ఆశలేదన్నారు పవన్ కళ్యాణ్. అడ్డదారులు తొక్కి అడ్డగోలుగా సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రమంతా పోస్టర్లు పెడుతున్నారన్నారు. జగన్ అబద్ధాలు చెప్పబోనన్నారు కానీ.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామన్నారని, మెగా డీఎస్సీతోపాటు అనేక హామీలిచ్చారని తెలిపారు. అయితే, అవేవీ నెరవేర్చలేదన్నారు. మద్యపాన నిషేధం చేయలేదన్నారు.

 

తాను ఎన్నికల కోసం ఆలోచించడం లేదని.. వచ్చే తరాల భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. జగన్ ఎన్ని మోసాలు, మాయలు చేసినా వాటన్నింటినీ అధిగమించి లక్ష్యాన్ని చేరుకుందామన్నారు. మనమందరం కలిసి దుర్మార్గపు పాలనను అంతం చేసి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పవన్ పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన ప్రభుత్వాన్ని సాధిద్దామన్నారు పవన్ కళ్యాణ్.

 

అంతకుముందు బాలశౌరి మాట్లాడుతూ.. ఈ ప్రజాస్వామ్యంలో దమ్ముధైర్యంతో ప్రశ్నించే నాయకుడు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అలాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. అందుకే రాష్ట్రంలో కొన్ని సమస్యలకైనా పరిష్కారం దొరికిందన్నారు.