AP

ఏపీలో రాజకీయాలు రసవత్తరం

పీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతుంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే పొత్తులు ఎత్తులతో ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు హంగామా మొదలుపెట్టాయి.

ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను ఎక్కు పెడుతూ రాజకీయ కాక పుట్టిస్తున్నారు. ఎన్నికలు రాకముందే ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తనకు ప్రాణహాని ఉందని వారాహి యాత్రలో చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. దీంతో పవన్ కళ్యాణ్ ప్రాణహాని వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాదు ఎవరికీ రక్షణ లేదని ఆమె పేర్కొన్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లిలో పర్యటించిన పురంధరేశ్వరి దిశ యాప్ తో పోలీసులు ఎవరినీ రక్షించలేకపోయారని పురంధరేశ్వరి మండిపడ్డారు. విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాక్షాత్తూ ఎంపీ కుటుంబానికే రక్షణ లేదంటే రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు చెప్పాలని పురంధరేశ్వరి నిలదీశారు. రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో ప్రతిపక్ష పార్టీల నాయకులకు రక్షణ లేదని అసహనం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే వారాహి యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు సుపారీ ముఠాలు రంగంలోకి దిగాయని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో ఎన్నికల సమయంలో కూడా తనను చంపాలని ప్రయత్నాలు జరిగాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.